ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్.. విద్యార్థులకు అవగాహన కోసం వర్చువల్ ల్యాబ్స్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకురానున్నట్టుగా మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య అందించాలని, ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్‌లోనైనా ఒకే స్థాయి విద్య అందాలని ఆదేశించారు.

Published on: Jan 22, 2026, 06:48:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం
మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం

వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఎడ్యుకేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

అత్యున్నత ప్రమాణాలతో విద్య

'ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4,140 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై ఎటువంటి రాజీలేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చదివిన వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, అదే స్థాయి బోధనను కొత్తగా ఏర్పాటైన జిల్లాల కాలేజీల్లోనూ అందించాలి. ఉస్మానియా విద్యార్థికైనా, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థికైనా ఒకే రకమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలి.' అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ప్రాక్టికల్ నాలెడ్జ్

మెడికోలకు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రతి మెడికల్ కాలేజీలో ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ మౌళిక వసతులను కల్పించాలన్నారు. తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలన్నారు.

వర్చువల్ ల్యాబ్స్

క్లిష్టమైన అనాటమీ, సర్జికల్ ప్రొసీజర్ల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వర్చువల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ టూల్స్, వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన పద్ధతులను వినియోగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి భవిష్యత్ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించి, వీటిని ఇతర కళాశాలలకు మెంటార్/శిక్షణా కేంద్రాలుగా మార్చాలని చెప్పారు.

ఏఐ టూల్స్ ద్వారా

'నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలోకి మార్చి, నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేయాలి. బోధనాసుపత్రుల్లోని రద్దీ దృష్ట్యా, విద్యార్థులకు క్లినికల్ కేస్ స్టడీలను వివరించేందుకు టెలీమెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలి. ప్రతి కళాశాలలో అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఐటీ అడ్మినిస్ట్రేటర్లు, టెక్నీషియన్లను నియమించాలి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు జరగాలి. విద్యార్థుల హాజరు, పనితీరును ఏఐ టూల్స్ ద్వారా నిరంతరం విశ్లేషించాలి.' అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More