Telangana Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన - ఈ నెల 30న నిధులు విడుదల
Telangana Rythu Bharosa Funds 2026 : తెలంగాణలో వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర సభలో ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Telangana Rythu Bharosa Funds 2026 : అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుత వానాకాలం సాగుకు సంబంధించిన ఈ పెట్టుబడి సాయం నిధులను కేవలం పది రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో పూర్తిగా జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రైతు భరోసా నిధుల విడుదలతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి ఒక ప్రత్యేక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు ప్రాధాన్యత కలిగిన అంశాలపై మంత్రివర్గ సహచరులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణ పనులు, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వీబీజీ రాంజీ పథకం అమలు తీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. వీటితో పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పన్నుల వాటా తదితర రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెద్ద ఊరటనివ్వనుంది.
సన్న ధాన్యానికి సంబంధించి ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ప్రజల వినియోగం, అధిక దిగుబడి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. దీని ప్రకారం బీపీటీ -5204, ఆర్‌ఎన్‌ఆర్ -15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715.. ఏడు రకాల సన్నాలకు బోనస్ వర్తిస్తుంది.
మంత్రుల సమావేశం - కీలక నిర్ణయాలు
ఈ కీలక సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , ధనసరి అనసూయ సీతక్క మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
- కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని సమావేశం భావించినట్టు మంత్రులు తెలిపారు.
- వానాకాలం సీజన్ కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని సమావేశం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని కోరుతూ త్వరలో ఢిల్లీకి వెళ్లి మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
- తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా రాష్ట్రానికే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పంపించకుండా తెలంగాణ యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని సమావేశం అభిప్రాయపడింది.
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కొత్తగా కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని కాకుండా పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సమావేశం తీర్మానించినట్టు మంత్రులు పేర్కొన్నారు.
- కొత్త చట్టం అమలుతో కూలీలపైనా, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , సీతక్క , వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.
- మెట్రో ఫేజ్ -2 విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఒప్పందం ప్రకారం రావలసిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని సమావేశం కోరింది.
- హైదరాబాద్ ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ - 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం.
- ఈ నెల 21న జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షకు రాష్ట్రంలో దాదాపు 208 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని సమావేశం నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

