ఢిల్లీలో విద్యార్థులపై దాడికి నిరసనగా జులై 24న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్!

నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో విద్యార్థులపై దాడులు చేశారంటూ తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

Updated on: Jul 22, 2026, 20:20:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై దాడులు చేశారని తెలంగాణలో వామపక్ష విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ మహా నగరంలోని జూనియర్ కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల (యూనివర్సిటీల) వరకు విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

జులై 24న బంద్
జులై 24న బంద్

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జులై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు విద్యార్థి నాయకులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. విద్యా హక్కులు, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని వామపక్ష విద్యార్థి సంఘాల (AISF, SFI, PDSU తదితర) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఢిల్లీలో విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల భద్రతను, భవిష్యత్తును గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU)తో పాటు కేయూ (KU), పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. జులై 24న జరగబోయే ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు యూనివర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ ఘటనపై విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. విద్యార్థులపై అణచివేతకు నిరసనగా ప్రతిపక్షాలు వీధుల నుంచి పార్లమెంట్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాయి. మంగళవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు ప్రధానమంత్రి నివాసం బయట ధర్నా నిర్వహించారు. పోలీసులు అఖిలేష్, ప్రియాంక, రాహుల్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, కొద్దిసేపటికే వారిని విడుదల చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More