...
...
Next Story

Smart Ration Card : 9 సేఫ్టీ ఫీచర్లతో తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డు

Telangana Smart Ration Card : తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమయ్యాయి. నకిలీవి సృష్టించకుండా ఉండేందుకు ఇందులో 9 రకాల సేఫ్టీ ఫీచర్లను పొందుపరిచారు.

Published on: Aug 14, 2026, 06:41:22 IST
Advertisement

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల రూపంలో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు అత్యాధునిక డిజైన్‌తో కూడిన ఆహార భద్రత కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. డూప్లికేషన్, నకిలీ కార్డుల ముప్పునకు శాశ్వతంగా చెక్ పెడుతూ పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డు
తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డు

ఈ నూతన కార్డుల తయారీలో ప్రభుత్వం అత్యున్నత రక్షణ ప్రమాణాలను పాటించింది. సాధారణంగా బ్యాంక్ నోట్లు, పాస్‌పోర్టులు, ఇతర గోప్యమైన ప్రభుత్వ పత్రాల తయారీలో వాడే 9 రకాల హై-టెక్ సెక్యూరిటీ ఫీచర్లను ఈ స్మార్ట్ కార్డుల్లో పొందుపరిచారు.

ఈ కార్డులను ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేయగానే, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే డిజిటల్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉండటం వల్ల ఈ కార్డులను కాపీ చేయడం గానీ, నకిలీలను సృష్టించడం గానీ సాధ్యపడదు. కార్డు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా, నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందించారు. పై భాగంలో (ఎడమవైపు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, పై భాగంలో (కుడివైపు)పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫొటో ఉంటాయి.

మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మహిళల పేర్లే యజమానిగా ముద్రణ చేస్తారు. కార్డు నంబర్, లబ్ధిదారుని పూర్తి చిరునామా (గ్రామం, మండలం, జిల్లా), కేటాయించిన డిపో (రేషన్ షాప్) సంఖ్య ఉంటాయి. రేషన్ సరుకుల పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఈ ఆహార భద్రత కార్డులే ప్రామాణికంగా మారనున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఈ కార్డులు అందేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. నకిలీ కార్డు ఏరివేత ద్వారా నిజమైన పేదలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

'ఆగస్టు 15 నుండి తెలంగాణలో కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డ్' విధానం ప్రారంభం కానుంది. 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. 3.42 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి నెలా 6 కిలోల నాణ్యమైన బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. అనవసరమైన చిక్కులు లేకుండా, రేషన్ విధానాన్ని సరళతరం చేయడం, సంక్షేమ ఫలాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆహార భద్రత అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. ప్రతి కుటుంబం ప్రభుత్వ మద్దతును పొందే అర్హత కలిగి ఉంది.' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks