జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి క్లీన్‌చిట్ - అనర్హత పిటిషన్ కొట్టివేసిన స్పీకర్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు.పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో నిర్ణయం వెలువడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.

న్యాయబద్ధంగా పనిచేస్తలేరు - జగదీశ్ రెడ్డి
మరోవైపు ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి… స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేస్తలేరని విమర్శించారు. “బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్‌కి కనపడకపోవడం విచారకరం. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్థమవుతున్నా చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు.
"స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారు.కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడతలేదా..? బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారు.స్పీకర్ ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు స్పీకర్ పిటీషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమే.స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదు.. వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయం” అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితం. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అని చెప్పారు.
“ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

