...
...
Next Story

బాధితులను ఆసుపత్రికి చేరిస్తే చాలు.. రవాణా శాఖ నుంచి మీ అకౌంట్‌లోకి రూ. 25 వేలు!

రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన రహ వీర్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తోంది.

Published on: Feb 9, 2026, 13:26:49 IST
Advertisement

రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రవాణా శాఖ రహ-వీర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కింద రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే పౌరులకు రూ. 25,000 నగదు ప్రోత్సాహకంతో బహుమతిగా ఇస్తుంది. అంతేకాదు అధికారికంగా సత్కరిస్తారు. సర్టిఫికేట్ కూడా అందిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ మేరకు రవాణా శాఖ ఈ స్కీమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎంపిక విధానాలను రూపొందించాలని, ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం.

పథకం కింద ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడానికి, వారిని ఆసుపత్రులకు తరలించడానికి పౌరులు ముందుకు వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారిని రహ-వీర్‌లుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రాణాలను కాపాడడంలో పౌరులు సకాలంలో జోక్యం చేసుకోవడం చాలా కీలకమని అధికారులు తెలిపారు చట్టపరమైన లేదా విధానపరమైన వేధింపులకు భయపడకుండా ఇటువంటి చర్యలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.

మార్గదర్శకాల ప్రకారం, తక్షణ సహాయం అందించే, బాధితుడిని ఆసుపత్రికి తరలించే వ్యక్తి వివరాలను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO), ఆసుపత్రి అధికారులు నమోదు చేస్తారు.

ఆ తరువాత పోలీసులు ఈ కేసును జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సభ్యులుగా, జిల్లా రవాణా అధికారి కన్వీనర్‌గా ఉన్న జిల్లా స్థాయి కమిటీకి సిఫార్సు చేస్తారు. పరిశీలన, ఆమోదం తర్వాత ఎంపికైన రహ వీర్ల వివరాలను రివార్డ్, సర్టిఫికేట్ కోసం రవాణా కమిషనర్‌కు పంపుతుంది.

ప్రమాదం జరిగినప్పటి నుంచి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తే.. ప్రాణాలు కాపాడవచ్చు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేసుల భయం లేకుండా ఇకపై మీరు సాయం చేయవచ్చు. రూ.25000 రివార్డుతోపాటుగా ప్రశంసా పత్రాన్ని పొందుతారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe