Telangana Weather Updates : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాలకు హెచ్చరికలు….

తాజా బులెటిన్ ప్రకారం….. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఈ వర్షాలు కురుస్తాయి. జూలై 29 నుంచి జూలై 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
జూలై 31 నుంచి ఆగస్టు 1 వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ వెదర్ రిపోర్ట్…
హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఇవాళ నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.. గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ లేదా నైరుతి దిశల నుండి గాలులు వీచే అవకాశం ఉంది.
భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలగొచ్చని అధికారులు తెలిపారు. పాత భవనాలు, చెట్లు కూలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.