...
...
Next Story

Temperatures : తెలంగాణలో సుర్రుమనిపిస్తున్న సూరీడు.. 30 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!

Temperatures Telangana : తెలంగాణలో రోజురోజుకు వేడి వాతావరణం పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Published on: Mar 30, 2026, 14:51:42 IST
Advertisement

గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం(మార్చి 29, 2026) నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఏకంగా 30 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. ఇది వేడి తీవ్రత గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. వీటిలో 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(టీజీడీపీఎస్) విడుదల చేసిన రోజువారీ వాతావరణ నివేదిక ప్రకారం, జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో అత్యధికంగా 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత దుమ్ముగూడెం (భద్రాద్రి కొత్తగూడెం), కాసీపేట (మంచిర్యాల), పెద్దావుర (నల్గొండ), భీంగల్ (నిజామాబాద్)లలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేల (ఆదిలాబాద్), ఆసిఫాబాద్ (కుమారం భీం ఆసిఫాబాద్), సుల్తానాబాద్ (పెద్దపల్లి)లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక చారకొండ (నాగర్‌కర్నూల్), మాగనూరు (నారాయణపేట)లో 41.4 డిగ్రీల సెల్సియస్, కొణిజర్ల (ఖమ్మం), వెంకటాపురం (ములుగు), భైంసా (నిర్మల్)లో 41.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఐనవోలు(హనుమకొండ జిల్లా)లో 41.2 డిగ్రీల సెల్సియస్‌, ఘణపూర్‌ (జయశంకర్‌ భూపాలపల్లి), సీరోలు (మహబూబాబాద్‌), నాగారం (సూర్యాపేట)లో 41.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంట్వారం (వికారాబాద్)లో 41డిగ్రీలు నమోదైంది.

మరో 12 జిల్లాల్లో 40 డిగ్రీలు, 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో మాత్రమే 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కీసర (మేడ్చల్ మల్కాజిగిరి), బీబీనగర్ (యాదాద్రి భువనగిరి) 39.9 డిగ్రీలు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe