తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. టీజీ ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్లలో క్లారిటీ!

TG EAPCET 2026 రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మరోవైపు ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Published on: Jul 17, 2026, 09:32:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి(2026-27) గాను రాష్ట్రంలో బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. శుక్రవారం(జులై 17) నుంచి టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఇందులోనే ఈ అదనపు సీట్లను అందుబాటులోకి తెస్తున్నారు.

తెలంగాణలో పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు
తెలంగాణలో పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు

ఇటీవలే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE) రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు దాదాపు 15 వేల అదనపు సీట్లను మంజూరు చేసింది. అయితే ఈ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో, గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విద్యాశాఖ అధికారులు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో అదనపు సీట్ల భర్తీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అధికారులు ఏ కళాశాలలో ఎన్ని సీట్లు పెంచాలనే దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 4,000 అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయానికి ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని కళాశాలలకు అనుమతులు నిరాకరిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.

మరోవైపు, నిబంధనల ప్రకారం సీట్లు పెంచాలంటే జేఎన్‌టీయూహెచ్ (JNTUH), ఉస్మానియా వర్సిటీ (OU) పరిధిలోని అధికారులు కాలేజీల్లో తనిఖీలు చేసి మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ తనిఖీలు పూర్తికాకపోయినప్పటికీ, ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే సీట్లు మిగిలిపోయాయి. మొదటి విడతలో మిగిలిన సీట్లు 8,162, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లు 19,325, రెండో విడతకు సిద్ధంగా ఉన్న పాత సీట్లు 27,487గా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 27,487 సీట్లకు తోడు ఇప్పుడు కొత్తగా పెరిగే అదనపు సీట్లు కూడా తోడవనున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More