...
...
Next Story

Telangana Govt : భూ యజమానుల కంప్లైంట్‌ నమోదుకు టోల్ ఫ్రీ నంబర్.. ఇదే

ప్రైవేటు భూమి న్యాయబద్దంగా ఉంటే ఒక్క గజానికి కూడ 22A ద్వారా ఆటంకం కలగనివ్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూమి అయితే మాత్రం అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు.

Updated on: Aug 18, 2026, 09:18:07 IST
Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా జవాబుదారిగా ఉంటుందని, 22A నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు మరియు సబ్ రిజిస్ట్రార్లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 22A తో ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సమీక్షలో మంత్రి పొంగులేటి
సమీక్షలో మంత్రి పొంగులేటి

న్యాయబద్ధంగా ఉన్న ప్రైవేటు భూమికి ఒక్క గజానికి కూడా 22A ద్వారా ఆటంకం కలగనివ్వమని, అదే సమయంలో ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోమని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. 22Aను భూతంగా చూపి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరిస్తూ, ఇప్పటివరకు వచ్చిన 757 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే తీవ్రంగా పరిగణిస్తాం. సమస్యలను చిన్నవిగా దాటవేయకుండా పరిష్కరించడం అధికారుల బాధ్యత. కేవలం 22A జాబితాలో ఉందనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించకూడదు. ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? రికార్డులు ఏం చెబుతున్నాయి? వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

22A సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజల సందేహాల నివృత్తి కోసం, తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం 18005994788 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు. సబ్ రిజిస్ట్రార్లకు నేరుగా పహానీ యాక్సెస్ కల్పించామన్నారు. రికార్డులను పరిశీలించి జెన్యూన్ కేసులను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను పెంచాలని, కార్యాలయాల పనివేళలను కూడా పొడిగించాలని ఆదేశించారు.

గతంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను నాటి అధికారులు సరిగ్గా అప్‌డేట్ చేయకపోవడంతో అవి నేటికీ 22A లోనే ఉండిపోయాయని పొంగలేటి అన్నారు. దీనివల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. భూదాన్, దేవాదాయ, ఫారెస్ట్ భూముల పక్కన ఉన్న ప్రైవేటు భూములకు ఒకే సర్వే నంబర్ ఉండటం వల్ల కూడా కొన్ని స్థలాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు. వీటిని ప్రత్యేకంగా గుర్తించి క్లియర్ చేయనున్నారు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న భూమి నిషేధిత జాబితాలో ఉంటే, దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారని పొంగలేటి తెలిపారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడం.. నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks