తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET 2026) కౌన్సిలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీతో పాటు, ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు బ్రాంచ్ మార్చుకునేందుకు…. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (Centralized Internal Sliding), స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం చదువుతున్న పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఇతర బ్రాంచ్‌లకు (ఉదాహరణకు ఈసీఈ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ నుంచి సివిల్ వంటి ఇతర విభాగాలకు) మారాలనుకునే విద్యార్థులు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈలోపు ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
అర్హత కలిగిన విద్యార్థులకు అంతర్గతంగా బ్రాంచ్ మారినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం…. ఫీజు రీయింబర్స్‌మెంట్ యథావిధిగా వర్తిస్తుందని కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
- ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ల నమోదు : జూన్ 28-2026 వరకు (నేడే ఆఖరి గడువు).
- సీట్ల కేటాయింపు : ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 30-2026 న లేదా అంతకంటే ముందే సీట్లను కేటాయిస్తారు.
- కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ - రిపోర్టింగ్: ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా కొత్త బ్రాంచ్ పొందిన విద్యార్థులు జూలై 1-2026 న తమ కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే రోజున తాము చదువుతున్న కళాశాలలోని కొత్త బ్రాంచ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం మిగిలిపోయిన సీట్లను ఆయా కళాశాలల్లో నేరుగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం టీజీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ ( https://tgpolycet.nic.in/ ) ను సందర్శించవచ్చు.