తప్పుదారి పట్టించే యాడ్స్‌పై టీజీ రెరా సీరియస్.. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు నోటీసులు

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA) ప్రకటనల ఉల్లంఘనలకు సంబంధించి పలు డెవలపర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది.

Published on: Feb 22, 2026, 18:32:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెరా రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటించకుండా ప్రాజెక్ట్ ప్రకటనలను ప్రచురించినందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) అనేక రియల్ ఎస్టేట్ డెవలపర్లు, సంస్థలకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అనేక ప్రకటనలు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనడంలో విఫలమయ్యాయని, నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించలేదని రెరా కనుగొంది.

తెలంగాణ రెరా
తెలంగాణ రెరా

ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, వెర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ వంటి సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో డెవలపర్లు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రస్తావిస్తున్నారు. కానీ రెరా మార్గదర్శకాలను పాటించడం లేదు. ప్రకటనలు ఫాంట్ పరిమాణం, స్పష్టతకు సంబంధించి రెరా నిబంధనలను పాటించలేదు. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్ అమేయా ప్రాజెక్ట్ విషయంలో ఫాంట్ పరిమాణాలు పాటించకపోవడం, పూర్తి ప్రాజెక్ట్ పేరును తొలగించడం వంటి ముఖ్యమైన ఉల్లంఘనలను అథారిటీ గుర్తించింది. మరో విషయం ఏమిటంటే ప్రాజెక్ట్ లేఅవుట్‌గా నమోదు చేశారని, కానీ తప్పుదారి పట్టించే విధంగా పూర్తి నివాస ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసినట్టుగా రెరా దృష్టికి వచ్చింది.

ప్రీ లాంచ్ ప్రకటనలపైనా టీజీ రెరా సీరియస్ అయింది. చెల్లుబాటు అయ్యే టీజీ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రీ-లాంచ్ ప్రకటనలను విడుదల చేయడం లేదా పెట్టుబడులను అభ్యర్థించవద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ప్రకటనల ప్లాట్‌ఫామ్‌లను అథారిటీ హెచ్చరించింది. అధికారిక ఆమోదం పొందక ముందే కొనుగోలుదారులను ఆకర్షించడానికి చేసే ఏదైనా ప్రయత్నం రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం, 2016 నిబంధనలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.

ఈ చట్టం ప్రకారం, 500 చదరపు మీటర్లు దాటిన లేదా ఎనిమిది కంటే ఎక్కువ అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించడం, మార్కెట్ చేయడం లేదా విక్రయించే ముందు తప్పనిసరిగా TG-RERAలో నమోదు చేసుకోవాలి.

అధికారులు ప్రాజెక్ట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రత్యేకమైన రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించిన తర్వాత మాత్రమే డెవలపర్‌లు యూనిట్లను ప్రకటించడానికి, మార్కెట్ చేయడానికి లేదా విక్రయించడానికి అనుమతి ఉంది. ఈ నంబర్ అన్ని ప్రకటనల్లో కచ్చితంగా వేయాలి. కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను చేరుస్తున్నా.. ప్రకటనల్లో రెరా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యాయని వెల్లడించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More