TG TET Update : తెలంగాణలో మీసేవ ద్వారా టెట్ సర్టిఫికెట్లు జారీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ అభ్యర్థులకు మీ సేవ ద్వారా టెట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.

Published on: Aug 18, 2026, 13:03:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. టెట్(TET) ఉత్తీర్ణత సర్టిఫికెట్లను మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో అభ్యర్థులు నేరుగా టెట్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాలు, డిజిటల్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. కానీ తొలిసారిగా ఈ విధానంలో మార్పులు చేస్తూ మీసేవ ద్వారా అధికారిక ధ్రువపత్రాలను అందజేయనున్నారు.

మీ సేవ కేంద్రాల్లో టెట్ సర్టిఫికెట్లు
మీ సేవ కేంద్రాల్లో టెట్ సర్టిఫికెట్లు

ఈ కొత్త విధానం ద్వారా అభ్యర్థులకు అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన ఒరిజినల్ సర్టిఫికెట్లు లభిస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. టెట్ పాస్ అయిన అభ్యర్థులతో పాటు ఫెయిల్ అయిన వారికి కూడా వారి ఫలితాల ధ్రువపత్రాలను మీసేవలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సర్టిఫికెట్ పొందేందుకు అభ్యర్థులు మీసేవ కేంద్రంలో రూ. 60 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మీ సేవ ద్వారా జారీ చేసే టెట్ పత్రాలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లాగే ఉంటాయి. సర్టిఫికెట్‌ మీద ప్రత్యేకంగా ఒక బార్‌కోడ్‌, నంబర్‌ కూడా ఇస్తారు. 2011 నుంచి ఇప్పటి వరకు టెట్‌ పరీక్ష పాసైన వారందరికి ముద్రిత మెమోలు జారీచేయనున్నట్టుగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

ఈ మెమో మీద అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర/సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలు ఉంటాయి. గతంలో టెట్ పరీక్ష పాసైన వారికి రెండుసార్లు ముద్రిత మెమోలు జారీ చేశారు. తర్వాత ఆన్‌లైన్ మెమోలను మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్టుగా విద్యాశాఖ గుర్తించింది. దీంతో ముద్రిత మెమోలు మీ సేవ ద్వారా జారీ చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల సాధనకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ మీసేవ ధ్రువపత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా బోధనా సిబ్బందిని నియమించుకునే ముందు టెట్ అర్హతను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో, ఈ హై-సెక్యూరిటీ సర్టిఫికెట్ నకిలీ పత్రాలకు చెక్ పెడుతుంది.

అభ్యర్థులు తమ టెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను మీసేవ కేంద్రంలో అందించి సులభంగా సర్టిఫికెట్ పొందవచ్చు. క్యూఆర్ కోడ్, ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్ల వల్ల ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా మారుతుంది. ఈ నూతన విధానం వల్ల ఆన్‌లైన్ డౌన్‌లోడ్ సమస్యలు తప్పడమే కాకుండా, అభ్యర్థులకు అధికారికంగా చెల్లుబాటయ్యే ప్రింటెడ్ ధ్రువపత్రాలు నేరుగా అందుబాటులోకి వస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More