ఢిల్లీ వేదికగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఛేదించారు. నకిలీ కాల్ సెంటర్లను నడుపుతూ, తెలంగాణకు చెందిన అమాయక ప్రజలను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

ఈ విచారణలో భాగంగా ఢిల్లీలోని మూడు వేర్వేరు కాల్ సెంటర్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు…. 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు మోసాలకు సహకరించిన ఒక బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ముగ్గురు కీలక సూత్రధారులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఢిల్లీ కేంద్రంగానే ….
ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా ఈ సైబర్ దందా సాగుతోంది. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి ఈ మూడు నకిలీ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం పోలీసుల కంటికి చిక్కకుండా పరారీలో ఉన్నారు. గత దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ కాల్ సెంటర్ల నెట్‌వర్క్ గుట్టుచప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది.
తెలంగాణ ప్రజలను నమ్మించి, మోసం చేయడానికి ఈ ముఠా అత్యంత పక్కా పథకాన్ని రచించింది. దీని కోసం 25 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి… తెలుగు ధారాళంగా మాట్లాడగలిగే మహిళలను టెలికాలర్లుగా నియమించుకున్నారు. ప్రధానంగా జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ ప్రాంతాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళలను ఢిల్లీకి తీసుకెళ్లి ఈ ఉద్యోగాల్లో చేర్పించారు.
ఈ మహిళలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఫోన్లు చేసేవారు. తక్కువ వడ్డీకే ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ బాధితులతో మాట్లాడి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకునేవారు.
{{/usCountry}}ఈ మహిళలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఫోన్లు చేసేవారు. తక్కువ వడ్డీకే ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ బాధితులతో మాట్లాడి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకునేవారు.
{{/usCountry}}ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ఆధారంగా టెలికాలర్లు బాధితులతో మాట్లాడేవారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో దఫదఫాలుగా డబ్బులు తమ ఖాతాల్లోకి జమ చేయించుకునేవారు. బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత…. వారితో మాట్లాడటం పూర్తిగా నిలిపివేసేవారు. కొన్ని సందర్భాల్లో రుణం త్వరలోనే మంజూరవుతుందంటూ మరిన్ని డబ్బులు గుంజేవారు.
నిలదీస్తే బెదిరింపులు…
ఒకవేళ బాధితులు అనుమానం వచ్చి జమ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని నిలదీస్తే, ఈ కేటుగాళ్లు బెదిరింపులకు దిగేవారు. లీగల్ నోటీసులు పంపుతామని, వ్యక్తిగత సమాచారాన్ని, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని… సమాజంలో పరువు తీస్తామని భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ భయంతో బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా వెనకడుగు వేసేలా ప్లాన్ చేసేవారు.
ఈ మెరు దాడుల్లో అధికారులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో తెలంగాణవ్యాప్తంగా నమోదు చేసిన 22 సైబర్ నేరాల కేసులతో ఈ నెట్‌వర్క్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోంది.
రుణాల పేరుతో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల పౌరులు తీవ్ర జాగ్రత్త వహించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, వెరిఫికేషన్ ఛార్జీలు చెల్లించే ముందు సదరు కాల్ చేసిన వ్యక్తి, సంస్థ యొక్క ప్రామాణికతను స్వతంత్రంగా సరిచూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.