...
...
Next Story

విద్యుత్ కనెక్షన్ తీసుకుంటున్నారా? ముందుగా ఈ కొత్త మార్పులు తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(TGERC) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్పులు ఏంటో తెలుసుకోండి.

Published on: Feb 04, 2026 06:13 PM IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో ప్రధాన మార్పులు గురువారం నుండి తెలంగాణలో అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లకు అవసరమైన దూరం ఆధారంగా వినియోగదారుల నుండి ఇకపై ఛార్జీ విధించరు.

విద్యుత్ కనెక్షన్ల కొత్త మార్గదర్శకాలు
విద్యుత్ కనెక్షన్ల కొత్త మార్గదర్శకాలు

గతంలో స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరం ఆధారంగా ఒక్కో విధంగా ఫీజు వసూలు చేస్తుండేవారు. కానీ ఇక మీదట ఫిక్స్‌డ్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మంజూరు చేసిన లోడ్‌ను బట్టి స్థిర ఛార్జీలు విధిస్తారు. గృహ విద్యుత్ కనెక్షన్ల కోసం, సవరించిన ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1 kW వరకు కనెక్షన్లకు రూ.500 స్థిర రుసుము వసూలు చేస్తారు. అయితే 1 kW నుండి 5 kW వరకు కనెక్షన్లకు రూ.500 ప్లస్, ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.600 వసూలు చేస్తారు.

కొత్త మార్గదర్శకాలు ఫిబ్రవరి 5 నుండి అమల్లోకి వస్తాయి. దీని వలన గృహ వినియోగదారులు, రైతులు, వాణిజ్య సంస్థలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. TGERC నోటిఫై చేసిన కొత్త మార్గదర్శకాలు తెలంగాణ అంతటా అమలు చేస్తారు. అర్హత ఉన్న అన్ని లో టెన్షన్(LT) విద్యుత్ కనెక్షన్లకు వర్తిస్తాయి.

ఈ సంస్కరణను అధికారులు వినియోగదారులకు అనుకూలమైన, రైతు కేంద్రీకృత చర్యగా అభివర్ణించారు. ఇది తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునిక నియంత్రణ పద్ధతులతో సమలేఖనం చేస్తుందన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం, ఇప్పటికే ఉన్న విద్యుత్ లైన్ నుండి ఒక కిలోమీటరు పరిధిలో కొత్త విద్యుత్ కనెక్షన్‌లను కోరుకునే వినియోగదారులకు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేదా పంపిణీ లైన్ల నుండి దూరంతో సంబంధం లేకుండా లోడ్ ఆధారంగా మాత్రమే ఛార్జ్ చేస్తారు. అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు కూడా స్థిర ఛార్జ్ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి.

కొత్త ఫ్రేమ్‌వర్క్‌తో ప్రభుత్వం దూర ఆధారిత అంచనా వ్యవస్థను అధికారికంగా ముగించినట్టైంది. భౌతిక దూరం కంటే మంజూరైన లోడ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ చర్య కొత్త కనెక్షన్లను వేగవంతం చేస్తుందని, బిల్లింగ్‌లో పారదర్శకతను నిర్ధారిస్తుందని అధికారులు అంటున్నారు.

అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించేవారు.. తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత కనెక్షన్లు పూర్తి సొసైటీకి కలిపి సింగిల్ పాయింట్ కనెక్షన్ ఎంచుకోవచ్చు. దీని మీద సొసైటీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe