ఫ్రీ బస్సుతో ఆర్టీసీ రాబడి పెరుగుతోంది.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులు : ఎండీ నాగిరెడ్డి

మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి రాబడి పెరుగుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. ఇప్పటి దాకా 250 కోట్లకుపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్టుగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్టుగా ప్రకటించారు.

Published on: Dec 16, 2025, 11:21:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భద్రాచలం ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మెుక్కలు నాటి.. అనంతరం బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడిన నాగిరెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రోజూ 10 వేల బస్సుల్లో 60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇందులో సుమారు 45 లక్షల మంది మహిళలు ఉన్నట్టుగా తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రాబడి పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 కోట్లకుపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఫ్రీ బస్సుతో మహిళలకు రూ.8500 కోట్ల వరకు ఆదా అయింది. రెండు సంవత్సరాలలో 2500 కొత్త బస్సులను కొనుగోలు చేశాం. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 800కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడు సంవత్సరాలలో హైదరాబాద్‌లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని వస్తాం.' అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.

మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ

మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చే చొరవలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(SERP) రవాణా రంగంలోకి మహిళలు ప్రవేశించడానికి సాధికారత కల్పించడంలో మరో అడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌ను నియమించింది.

తాజాగా SERP, ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సహకారంతో ప్రజా భవన్‌లో మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడానికి ఒక అవగాహన ఒప్పందం(MoU)పై సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి SERP చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ అధ్యక్షత వహించారు. శిక్షణ కార్యక్రమంలో చేరిన అనేక మంది ఆశావహులు అవకాశం లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన, ప్రొఫెషనల్ బస్సు డ్రైవర్లుగా పనిచేస్తామని చెప్పారు.

ఈ స్థాయిలో మహిళలు నడిపే బస్సు డ్రైవర్ శిక్షణా కార్యక్రమానికి అధికారికంగా మద్దతు ఇచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీ తమదని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ నిర్వాహకులు తెలిపారు. మహిళలకు డ్రైవింగ్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సు కార్యకలాపాలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ చొరవ కొత్త కెరీర్ మార్గాలను సృష్టిస్తుందన్నారు. రవాణా రంగంలో నమ్మకం, శ్రామిక శక్తిని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More