...
...
Next Story

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. కొన్ని అంశాలే పెండింగ్‌లో ఉన్నాయి : మంత్రి పొన్నం

TGSRTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

Published on: Apr 22, 2026, 10:57:15 IST
Advertisement

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

'సమస్యలకు సమ్మె పరిష్కారం కాదు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేశాం. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలి. 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేసేవి. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తాం.' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కొనసాగుతున్న సమ్మె

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. మంగళవారం రాత్రి ఆర్టీసీ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలమవడంతో, బుధవారం ఉదయం నుంచి టీజీఎస్ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం ఎల్బీ నగర్ క్రాస్‌రోడ్స్ వద్ద తిరుగుతున్న ఒక బస్సు కిటికీ అద్దాలను కార్మికులు పగలగొట్టారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలిగింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. జేఏసీ మూడు కీలక ప్రాధాన్యతలతో 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది. చర్చలు విఫలమైన తర్వాత మార్చి 13న జేఏసీ అధికారిక నోటీసు జారీ చేసినప్పటి నుండి సమ్మె గురించి ఆందోళన కొనసాగుతూనే ఉంది.

జేఏసీ లేవనెత్తిన డిమాండ్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల సమయం కోరినప్పటికీ సమ్మె అనివార్యమైంది. ఉద్యోగుల సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వ రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుందని కార్మికులు నిరసనలు చేపట్టడంతో, శాంతిభద్రతలను కాపాడటానికి పలు డిపోల వద్ద పోలీసు సిబ్బందిని మోహరించారు. సమ్మె ప్రభావం వెంటనే స్పష్టంగా కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks