...
...
Next Story

NEET Free Coaching : తెలంగాణలో ఫ్రీగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

2026-2027 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అందించనుంది. ఆసక్తి, అర్హులైన విద్యార్ధినీ, విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published on: Aug 12, 2026, 19:06:03 IST
Advertisement

వైద్య విద్యనభ్యసించి డాక్టర్ కావాలనుకునే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2027 జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET UG 2027)కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TGSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు.

ఉచితంగా నీట్ కోచింగ్
ఉచితంగా నీట్ కోచింగ్

2026 - 27 అకాడెమిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ లాంగ్ టర్మ్ నీట్ శిక్షణను అందించనున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా బాలురు, బాలికలకు వేర్వేరు క్యాంపస్‌లలో ఉచిత వసతి భోజన సౌకర్యాలతో ఈ శిక్షణ ఉంటుంది.

బాలుర(100 సీట్లు)కు చిలుకూరులోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ (TGSWR) ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో శిక్షణ ఇస్తారు. బాలికల(100 సీట్లు)కు మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ వేదికగా శిక్షణ అందిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 2026 నీట్ యూజీ (NEET UG) రాసిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఉచిత శిక్షణలో అవకాశం కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరూ ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోవచ్చు.

ఈ శిక్షణకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. విద్యార్థులు గురుకుల సొసైటీ అధికారిక వెబ్‌సైట్ tgswreis.telangana.gov.in సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌తో పాటు మార్కుల మెమోలు, నీట్ 2026 స్కోర్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి ఇంటర్ మెరిట్, నీట్ 2026 స్కోర్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. అర్హత సాధించిన విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన కోచింగ్, కార్పొరేట్ స్థాయిలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1800-425-45678 ను సంప్రదించవచ్చు.

దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది 22.08.2026గా ఉందని గుర్తుంచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe