తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకమైన చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు.
సమావేశం ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు.
సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు.
ఆ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి.. వివిధ దశల్లో జరుగుతున్న ప్రయత్నాలను తెలిపారు. 5 దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేకపోయామన్నారు.
2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
{{/usCountry}}ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
{{/usCountry}}బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ - మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని తెలిపారు.
అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ పోరాట కాలం నుంచి ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
దశాబ్దాలుగా వారి ఆకాంక్షలు నెరవేరలేదని, ఆదిలాబాద్ గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. దేశ రక్షణ, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.
మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా కూడా నిలుస్తుందన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రెండు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు.
మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు మహారాష్ట్ర సీఎం. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
స్నేహభావం, సోదరభావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని గుర్తుచేశారు. పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందన్నారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు.
ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని సూచించారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.