Hyderabad Gold Theft Case : వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - యూపీలో నేపాలీ దంపతులు అరెస్ట్..!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో పనిమనుషులుగా చేరి, 7.5 కేజీల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండిని దోచుకెళ్లిన కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు నేపాలీ నిందితులను ఉత్తరప్రదేశ్‌లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరి…. భారీ ఎత్తున నగల దోపిడీకి పాల్పడిన ముగ్గురు నేపాలీ దేశస్థులను ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 7.5 కిలోల బంగారు ఆభరణాలు, సుమారు 1.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నమ్మకంగా చేరి… నిలువునా ముంచారు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ప్రాంతంలో నివసించే ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఒక నేపాలీ దంపతులు వంటమనిషిగా, ఇంటి పనిమనిషిగా కొద్దిరోజుల క్రితం చేరారు. యజమానుల నమ్మకాన్ని చూరగొన్న వీరు…. జూన్ 6వ తేదీన కుటుంబ సభ్యులందరూ ఇంట్లో లేని సమయాన్ని చూసి భారీ స్కెచ్ వేశారు. లాకర్ దగ్గరే భద్రపరిచిన కీని ఉపయోగించి లాకర్‌ను తెరిచారు. అందులో ఉన్న మొత్తం బంగారు, వెండి ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా లాకర్‌ను యథావిధిగా లాక్ చేసి, ఆ తాళం చెవిని కూడా తమతో పాటే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి చూసుకునే సరికి అపహరణ ఉదంతం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆరు బృందాలు.. మూడు రాష్ట్రాల్లో వేట
ఈ భారీ దొంగతనంపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభాగం వేగంగా స్పందించింది. లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించినట్లు శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన దీప్తి వివరించారు. నిందితులు ఉత్తర భారతదేశం వైపు పారిపోతున్నట్లు గుర్తించిన వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు… ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు తక్షణమే తరలించారు. ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులకు నిందితుల ఫోటోలు, పూర్తి వివరాలను చేరవేసి, సరిహద్దుల్లో గాలింపును తీవ్రం చేశారు.
పక్కా సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వేచి చూసిన సైబరాబాద్ ప్రత్యేక బృందం.. నిందితులను చుట్టుముట్టి విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన వారిలో సదరు నేపాలీ దంపతులతో పాటు వారికి సహకరించిన మరో నేపాలీ మహిళ ఉన్నారు. దొంగిలించిన సొత్తును ఎక్కడా విక్రయించకుండా, మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను రాంపూర్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై వారిని హైదరాబాద్‌కు తరలించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
నగరంలో నివసించే పౌరులు ఇటువంటి భారీ దొంగతనాల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇళ్లలో పనిమనుషులను, ముఖ్యంగా నేపాలీ కార్మికులను నియమించుకునేటప్పుడు వారి పూర్వాపరాలను కచ్చితంగా పరిశీలించాలని సూచించింది. స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా వారి ఐడెంటిటీ, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని…. ఇలాంటి అప్రమత్తత వల్లనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

