నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ చిన్నారుల చదువుకు, వినోదానికి, భావవ్యక్తీకరణకు ఎన్నో తలుపులు తెరిచింది. అయితే అదే స్థాయిలో ఆన్‌లైన్ ప్రపంచం వారి భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోంది. సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచార చోరీ, ఫొటోల దుర్వినియోగం, డిజిటల్ లైంగిక వేధింపుల బారిన పడి అనేకమంది పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

ఈ భయానక పరిస్థితులపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు CRY (చైల్డ్ రైట్స్ అండ్ యు) ప్రతిష్టాత్మకమైన 'టింగ్ టాంగ్' ప్రచారాన్ని చేపట్టింది. ఆన్‌లైన్ లో ఏదైనా క్లిక్ చేసే ముందు, సమాచారాన్ని షేర్ చేసే ముందు లేదా నమ్మే ముందు కాస్త ఆగి రెండుసార్లు ఆలోచించాలి అనేదే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలను విశ్లేషించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుండి 2024 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పిల్లలపై జరిగే సైబర్ నేరాలు ఏకంగా 20 రెట్లు పెరిగాయి. 2017లో కేవలం 88 కేసులు మాత్రమే నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 1,753కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) కింద నమోదయ్యే నేరాలు దేశంలో 157 రెట్లు పెరిగాయి. 2017లో తెలంగాణలో సున్నాగా ఉన్న బాలల సైబర్ నేరాల సంఖ్య 2024 నాటికి 72 కేసులకు పెరిగింది. దేశవ్యాప్త కేసుల్లో తెలంగాణ 4 శాతం వాటాతో 8వ స్థానంలో ఉంది.
తెలంగాణలో నమోదైన 12 CSAM కేసుల్లో 83 శాతం కేసులు సైబరాబాద్, వరంగల్, రామగుండం, రాజన్న సిరిసిల్ల కమిషనరేట్ల పరిధిలోనే నమోదయ్యాయి. 'స్క్రీన్లపై జరిగే దాడులు చిన్నారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. భయంతో చాలామంది పిల్లలు ఈ వేధింపులను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తున్నారు.' అని జాన్ రాబర్ట్స్, సౌత్ రీజినల్ డైరెక్టర్ (CRY) అన్నారు.
ఈ సైబర్ బెదిరింపుల నుంచి పిల్లలకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ పోలీస్ నిఘా విభాగం ('ఉమన్ సేఫ్టీ వింగ్'), సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లు శ్రమిస్తున్నాయి.
{{/usCountry}}ఈ సైబర్ బెదిరింపుల నుంచి పిల్లలకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ పోలీస్ నిఘా విభాగం ('ఉమన్ సేఫ్టీ వింగ్'), సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లు శ్రమిస్తున్నాయి.
{{/usCountry}}సైబ్‌హెర్ (CybHER) ప్రోగ్రామ్ విద్యార్థినులలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం అమలవుతోంది. పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయులను, విద్యార్థులను 'సైబర్ అంబాసిడర్లు'గా తీర్చిదిద్ది సైబర్ నేరాలపై చైతన్యం నింపుతున్నారు. డిజిటల్ నోటిఫికేషన్ లేదా అలర్ట్ శబ్దమైన ‘టింగ్ టాంగ్’ను మైండ్ అలారమ్‌గా వాడుకోవాలని CRY పిలుపునిచ్చింది.
CRY చెప్పిన ముఖ్య సూత్రాలు ఏంటంటే.. నమ్మే ముందు: ఆలోచించండి, క్లిక్ చేసే ముందు: జాగ్రత్త వహించండి, షేర్ చేసే ముందు: స్వయంగా సరిచూసుకోండి అనేది టింగ్ టాంగ్ క్యాంపెయిన్ ఉద్దేశం.
ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలను భాగస్వాములను చేస్తూ ఆన్‌లైన్ భద్రతను ఒక సామాజిక బాధ్యతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించేందుకు సాంకేతిక సంస్థలు కూడా తమ వయస్సు ధృవీకరణ విధానాలను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాంపెయిన్ ముఖ్యాంశాలు
పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల్లో అవగాహనను, డిజిటల్ సాధికారతను పెంపొందించడం.
సమాజికంగానూ, పాఠశాలలు కేంద్రంగానూ చేపట్టే చిన్నారుల రక్షణ కార్యక్రమాల్లో ఆన్‌లైన్ భద్రతను చేర్చడం.
ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం పిల్లలకు అందించడం
బహుళ వేదికలతో భాగస్వామ్యాల ద్వారా నిరంతర ప్రజా భాగస్వామ్యంతో ఈ చర్చను ముందుకు తీసుకెళ్లడం.
పాలనా, విధాన పరమైన చర్చల్లో చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను తక్షణ ప్రాధాన్యత గల అంశంగా నిలబెట్టడం.
“భారతదేశ డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ, ఈ సమష్టి ఉద్యమంలో భాగం కావాలని ప్రతి పౌరుడిని CRY ఆహ్వానిస్తోంది. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా, విధాన నిర్ణేతలుగా, సాంకేతిక నిపుణులుగా లేదా సమాజంలోని సభ్యులుగా – చిన్నారులకు భద్రదమైన సైబర్ వాతావరణాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది” అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.