వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత.. టీఆర్ఎస్ నేత పెళ్లిలో ఇంట్రస్టింగ్ సీన్!

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఓ పెళ్లికి హాజరయ్యారు. అంతేకాదు వధువు మెడలో తాళి కట్టారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Aug 26, 2026, 18:48:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఆరాధ్య కన్వెన్షన్ హాల్‌ ఒక వివాహ మహోత్సవం జరిగింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు, గతంలో తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేసిన బాషబోయిన బాలప్రసాద్, సీతాఫల్‌మండికి చెందిన శివానిల వివాహ వేడుక వైభవంగా జరిగింది.

వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

ఈ కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరుకావడమే కాకుండా, వరుడి కుటుంబంలో ఒక ఇంటి ఆడబిడ్డగా పూర్తి బాధ్యతలు తీసుకుని ముదిరాజ్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి క్రతువులను దగ్గరుండి జరిపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాలప్రసాద్‌కు సొంతంగా అక్కాచెల్లెళ్లు లేరు. తెలంగాణ జాగృతి కాలం నుండి కల్వకుంట్ల కవితతో ఉన్న ఆత్మీయ అనుబంధం, గౌరవంతో తన పెళ్లిలో ఆమెనే తన సొంత సోదరి స్థానంలో ఉండి ఆడపడుచుగా వివాహ ఆచారాలను నిర్వహించాలని బాలప్రసాద్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తికి కవిత ఎంతో సంతోషంతో అంగీకారం తెలిపారాని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ముదిరాజ్ సమాజంలో ఉన్న ప్రత్యేక ఆచారం ప్రకారం, వరుడు మాంగళ్యధారణ (మంగళసూత్రం కట్టడం) చేయడానికి ముందే, వరుడి వైపు సోదరి లేదా కుటుంబానికి చెందిన మహిళా ప్రతినిధి కొన్ని ముఖ్యమైన వివాహ క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది.

ముందుగా కల్వకుంట్ల కవిత వధువు శివానితో కలసి ప్రత్యేకంగా నిర్వహించిన గౌరీ పూజలో పాల్గొన్నారు. ముదిరాజ్ ఆచారం ప్రకారం కవిత పసుపు కొమ్ముతో తయారు చేసిన తాళిని వధువు శివాని మెడలో మూడు ముళ్లు వేసి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేశారు. అనంతరం నవవధువు వేలికి ఉంగరాన్ని తొడిగారు.

చివరగా ముదిరాజ్ సాంప్రదాయ పద్ధతిలో వధువుకు ఒడిబియ్యం పోసి, కొత్త దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. కవిత ద్వారా ఈ సాంప్రదాయ క్రతువులన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వరుడు బాలప్రసాద్ వధువు శివాని మెడలో ప్రధాన మంగళసూత్రాన్ని ధరింపజేయడంతో వివాహ వేడుక శాస్త్రోక్తంగా పూర్తయింది.

ఈ ఆత్మీయ వేడుకలో వరుడు బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప, బాలకృష్ణలతో పాటు ఆయన సోదరుడు నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులు కవిత ఇంటి ఆడబిడ్డగా మారి చేసిన పనులకు ఎంతో పొంగిపోయారు. తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఇరువర్గాల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

బిజీ షెడ్యూల్‌లోనూ కార్యకర్త కుటుంబంలోని సభ్యురాలిలా కవిత చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. సొంత సోదరిలా మారి పెళ్లి క్రతువులు జరిపించిన కల్వకుంట్ల కవిత తీరుపై ముదిరాజ్ సంఘ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More