బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్... రోజంతా కొనసాగిన ఉద్రిక్తత! ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సస్పెన్షన్ కు గురయ్యారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేసి.. మండలి ఛైర్మన్‌కు పంపింది. ఈ సెషన్ ముగిసే వరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు… వారిని శాసనమండలి నుంచి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీలో వారి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు.

తెలంగాణ శాసనమండలి సభ్యులైన తాతా మధుసూధన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
నాటకీయ పరిణామాలు, కోర్టు ఆదేశాలు
సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అత్యంత దారుణమైన, అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ ఓఎస్డీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ (BNS), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం తాతా మధుసూధన్, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.
అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఒక్కొక్కరికి రూ.20,000 రెండు పూచీకత్తులతో సొంత బాండ్ సమర్పించాలని ఆదేశిస్తూ ఇద్దరు ఎమ్మెల్సీలను విడుదల చేసింది.
సస్పెన్షన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద తాతా మధుసూధన్ ప్రసంగిస్తుండగా…. మార్షల్స్ ఆయనను అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించడం తీవ్ర కలకలం రేపింది. సస్పెన్షన్ ఎదుర్కొన్న సభ్యులు ప్రాంగణాన్ని వీడాలనే నిబంధనల మేరకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ తల్లిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను అసెంబ్లీ తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రతిపక్ష నేతలు ఇలా వ్యవహరించడం సమర్థనీయం కాదని, ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహిస్తూ స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సభ డిమాండ్ చేసింది. మహిళల సమక్షంలో సగం దుస్తులు విప్పి నిరసన తెలపడం కూడా అసభ్యకరమని తీర్మానంలో పేర్కొన్నారు. స్పీకర్ దళితుడు కావడంతో ఆయనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దళిత సమాజాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి.
సభలో తీవ్ర ఉద్రిక్తత
అసెంబ్లీ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ…. సోమవారం రోజు పోలీసులు వ్యవహారించిన తీరుపై ధ్వజమెత్తారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతూ పోలీసులు దురహంకారంతో వ్యవహరించారని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపైనే తిరిగి అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.
దీనిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. "నా తల్లిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. కోపం తెచ్చుకోవాల్సింది నేను, మీరు కాదు! మీ తల్లిని అనలేదు, నా తల్లిని అన్నారు," అని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు రాష్ట్ర మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్)తో పాటు ఇతర నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తమ నాయకుడి ప్రాణాలకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇదే సమయంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తమ అధినేత కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారని…. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌లపై కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

