...
...
Next Story

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో రెండు కొత్త గోల్ఫ్ కోర్సులు

తెలంగాణలో రెండు ఇంటర్నేషనల్ లెవెల్ గోల్ఫ్ కోర్సులను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. జవహర్‌నగర్, సోమశిల దగ్గర వీటిని నిర్మించేందుకు ఆలోచనలు చేస్తున్నారు.

Published on: Aug 30, 2026, 14:31:54 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజంను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు రెండు కొత్త అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ కోర్సులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

గోల్ఫ్
గోల్ఫ్

ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రెండు ప్రతిష్టాత్మక గోల్ఫ్ కోర్సులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఉన్న సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో మొదటి గోల్ఫ్ కోర్సును నిర్మించాలని చూస్తోంది ప్రభుత్వం. రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానం ఉండటం వల్ల ఇది అంతర్జాతీయ పర్యాటకులకు ఎంతో అందుబాటులో ఉంటుంది.

రెండో ప్రతిష్టాత్మక గోల్ఫ్ కోర్సును నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని సోమశిల వద్ద కృష్ణా నది ఒడ్డున అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. కృష్ణా నదీ తీరాన ప్రతిపాదించిన సోమశిల గోల్ఫ్ కోర్సును ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కృష్ణా నది, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిసరాల్లో రూపుదిద్దుకోనుంది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గోల్ఫ్ కోర్స్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన రహదారులు, మౌలిక వసతులు, ఇతర సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. గోల్ఫ్ క్రీడ కేవలం రాజధాని హైదరాబాద్ నగరానికే పరిమితం కాకూడదని, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు నొక్కిచెప్పారు.

భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ఫ్ క్రీడాభిమాని అయిన కపిల్ దేవ్ అనుభవాన్ని, సేవలను తెలంగాణలో క్రీడలు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పర్యాటక శాఖ మంత్రి వెల్లడించారు. ఈ రెండు నూతన గోల్ఫ్ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, తెలంగాణను అంతర్జాతీయ గోల్ఫ్ టూరిజం మ్యాప్‌లో ప్రముఖ కేంద్రంగా నిలిపేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks