...
...
Next Story

మహిళలకు ఉచిత కుట్టు మిషన్లపై అప్డేట్.. 1.90 లక్షల మందికి ఇచ్చేందుకు డేట్ ఫిక్స్!

బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు అందించేలా కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలన్నారు.

Published on: Oct 27, 2026, 18:58:52 IST
Advertisement

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాలు, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు 38 ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.

బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకానికి సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. డిసెంబర్ 9న కుట్టు మిషన్లు అందించేలా టెండర్ ప్రక్రియతో పాటు ఇతర ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

'రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన పాఠశాలలకు సొంత భవనాలు కల్పించేలా స్థల సేకరణ, నిర్మాణ అనుమతులు, నిధుల మంజూరుపై చర్యలు తీసుకోవాలని సూచించాను. జిల్లా కలెక్టర్లు నెలకు ఒక గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి నివేదికలు అందించాలి.'అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో కమిటీ నివేదిక ఆధారంగా సంస్కరణలు చేపట్టి, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు మంత్రి పొన్నం. బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కమిషనర్ బాలమాయాదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks