తెలంగాణలో పెరిగిన కూరగాయల ధరలు.. కిలో టమోటా, ఉల్లికి ఎంతంటే?
తెలంగాణలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి, టమాటా ధరలు పెరగడంతో సామాన్యుల కిచెన్ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.
పండుగల వేళ తెలంగాణవ్యాప్తంగా ప్రజలకు కూరగాయల మంట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యావసరలు, కూరగాయల ధరలు పెరగడంతో గృహ బడ్జెట్‌లు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ధరల ఘాటుకి తట్టుకోలేక వినియోగదారులు కొనుగోళ్లను బాగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత కొద్ది వారాలుగా మార్కెట్‌లో అత్యంత కీలకమైన టమోటా, ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని వీధి మార్కెట్లలో కిలో రూపాయిలు 20కి లభించిన టమోటా ధర ఇప్పుడు రూ. 50కి చేరింది. సూపర్ మార్కెట్లలో అయితే కిలో రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. వీధి మార్కెట్లలో దాదాపు 150 శాతం, సూపర్ మార్కెట్లలో 71 శాతం మేర ధర పెరిగింది. తీవ్రమైన ఎండలు, నీటి కొరత, పంట నష్టం, మార్కెట్‌కు దిగుబడులు తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
సెప్టెంబర్ నెల ప్రారంభంలో కిలో రూ. 30గా ఉన్న ఉల్లి ధర, అక్టోబర్ ప్రారంభం నాటికి రూ. 65 నుంచి రూ. 70కి చేరింది. హైదరాబాద్ రైతుబజార్లలో గత నెలలో రూ. 45-50 ఉండగా, వీధి వ్యాపారులు రూ. 60 వరకు అమ్మారు. క్విక్-కామర్స్ యాప్‌లలో కిలో ఉల్లి ధర రూ. 60 నుంచి రూ. 70 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి రెండు కిలోలకు 130, టమోట 2 కిలోలకు రూ.90కి అమ్ముతున్నారని బోయిన్‌పల్లి మార్కెట్‌లో పని చేస్తున్న బండి మహేశ్ అనే వ్యక్తి తెలిపారు.
కేవలం టమోటా, ఉల్లి మాత్రమే కాకుండా మిగిలిన నిత్యం వాడే కూరగాయల ధరలు కూడా పెరిగాయి. కూకట్‌పల్లి రైతుబజార్‌లో సెప్టెంబర్ చివరి వారంలో కిలో వంకాయ రూ. 35, బెండకాయ, పచ్చిమిర్చి రూ. 45, కాకరకాయ రూ. 35, బీరకాయ రూ. 40 ఉండగా, ప్రస్తుతం మార్కెట్ పరిశీలన ప్రకారం ఇవన్నీ కూడా కిలో రూ. 50 దాటిపోయాయి.
సాధారణంగా ఒకేసారి 3 నుండి 4 కిలోల కూరగాయలు కొనుగోలు చేసే గృహిణులు, ఇప్పుడు కేవలం ఒక కిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కూరగాయలు త్వరగా పాడైపోతాయనే భయం కూడా కొనుగోళ్లు తగ్గడానికి మరొక కారణం.
తెలంగాణకు ప్రధానంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి జరుగుతుంది. తెలంగాణకు ఉల్లి సరఫరా చేసే ప్రధాన ప్రాంతాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల వల్ల పంట తగ్గింది. గత సీజన్‌లో తీవ్ర నష్టాలు రావడంతో కర్నూలు ప్రాంతంలో చాలామంది రైతులు ఈసారి ఉల్లి సాగును తగ్గించారు. ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో కూడా టమోటా, ఇతర కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2026లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదు కాగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 7.74 శాతానికి చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు పెరిగాయి. పండుగ వేళ వంటగది బడ్జెట్ పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


