గ్రేటర్ వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్) ప్రాజెక్ట్ త్వరగానే పట్టాలెక్కబోతుంది. ఇటీవలనేప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి… పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.
వచ్చే నెలలో పనులు...

వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. దశల వారీగా చేపట్టే ఈ పనులు…. వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ పనులు చేపడుతారు. రాజస్థాన్‍కు చెందిన ఎన్.కే.బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యూడీఎస్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేసింది.
తాజాగా వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా భూగర్బ డ్రైనేజీ ప్రాజెక్ట్ పై కీలక ఆదేశాలిచ్చారు. వరంగల్ నగరంలో 5,257 కోట్ల రూపాయిలతో చేపట్టే భూ గర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల(ఏప్రిల్)లో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
మూడు దశలలో నిధులను వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అలాగే వర్షపునీటి ప్రవాహం-యాజమాన్య వ్యవస్థ, నీటిసరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. భూగర్భ డ్రైనేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5,257.20 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల (UGD) ప్రాజెక్ట్ - ఫేజ్ 1కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
- ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర నిధులతో చేపడుతారు.
- కేంద్ర ప్రభుత్వం వాటాగా 25 శాతం (రూ.1,314.30), రాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం (రూ.1,314.30 కోట్లు) ఉండగా… మిగతా 50 శాతం నిధులను బ్యాంకు రుణం లేదా పీపీపీ పద్ధతిలో సమకూర్చుస్తారు.
- భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులపై కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రాథమికంగా అంగీకరించింది.
- వరంగల్‌లో ఫేజ్-1 కింద రూ.5,257.20కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలనే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.
- ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వరంగల్ నగర రూపురేఖలు మారిపోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వస్తుంది. సెప్టిక్ ట్యాంకులు , బహిరంగ మురుగు కాలువల అవసరం లేకుండా నేరుగా భూగర్భ పైపుల ద్వారా మురుగునీటి తరలింపు జరుగుతుంది.