ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో అత్యంత కీలకమైన, భౌగోళికంగా క్లిష్టమైన ఘట్టం పూర్తయిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టన్నెల్ నిర్మాణంలో నిరంతరం సవాళ్లు విసిరిన ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటుకుని తవ్వకాల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.

టన్నెల్ పనులపై హైదరాబాద్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
సమీక్షా సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాతో పంచుకున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు 700 మీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
అవుట్‌లెట్ వైపు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర తవ్వకాలు జరిగాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మొత్తం 43.968 కిలోమీటర్ల పొడవైన ప్రధాన సొరంగ మార్గంలో ఇప్పటివరకు 79 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉందని తెలిపారు.
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సగటున 8 మీటర్ల మేర తవ్వకాలు జరుగుతున్నాయని, అదనపు ఆధునిక యంత్రాలను వినియోగించి రోజువారీ తవ్వకం వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. తవ్వకాల వేగాన్ని పుంజుకునేందుకు అవసరమైన అధునాతన భారీ యంత్రాలను సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు జర్మనీ దేశం నుండి ప్రత్యేకంగా తెప్పిస్తున్న లోకోమోటివ్ యంత్రం అక్టోబరు చివరి నాటికి ప్రాజెక్టు స్థలానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.
2028 మే - జూన్ నాటికి టన్నెల్–1 అనుసంధాన పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు, ఎండిపోతున్న వ్యవసాయ స్థలాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.
{{/usCountry}}2028 మే - జూన్ నాటికి టన్నెల్–1 అనుసంధాన పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు, ఎండిపోతున్న వ్యవసాయ స్థలాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.
{{/usCountry}}ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యంత ప్రాధాన్యమైనదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దశాబ్దాలుగా మందకొడిగా సాగుతున్న ఈ సొరంగ మార్గం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నల్గొండ జిల్లాలోని కరువు ప్రాంతాలకు, ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. నిధుల కొరత లేకుండా పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.