Water Tourism : తెలంగాణలో 6 జలాశయాల్లో క్రూయిజ్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, హౌస్‌బోట్లు

Water Tourism : తెలంగాణలో వాటర్ టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. 6 జలాశయాల్లో క్రూయిజ్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, హౌస్‌బోట్లు ఏర్పాటు చేయనున్నారు.

Published on: Sep 3, 2026, 06:58:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వాటర్ టూరిజం విస్తరణపై దృష్టి సారించింది. హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటికే 120 సీట్ల సామర్థ్యం కలిగిన ముచుకుంద డబుల్ డెక్కర్ క్రూజ్ బోట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరు ప్రధాన జలాశయాల్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, లగ్జరీ డైన్-ఇన్ క్రూజ్ బోట్లు, హౌస్‌బోట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్షిప్ (PPP) నమూనాలో వీటిని అభివృద్ధి చేసి, నిర్వహించడానికి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రైవేట్ సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది.

తెలంగాణలో వాటర్ టూరిజం
తెలంగాణలో వాటర్ టూరిజం

ప్రతిపాదిత ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, క్రూయిజ్ బోట్లు హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం చెరువు, కోకాపేట సరస్సు, మల్కం చెరువుల వద్ద ఏర్పాటు కానున్నాయి. కాగా నాగార్జునసాగర్, సోమశిల, రామప్ప సరస్సుల వద్ద హౌస్‌బోట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ప్రతి ఫ్లోటింగ్ రెస్టారెంట్ లేదా లగ్జరీ క్రూజ్ 100 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఉంటుంది. హౌస్‌బోట్లలో కనీసం 5 ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు (అటాచ్డ్ బాత్‌రూమ్‌లతో) అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టులు కనీసం 3-స్టార్ ఆతిథ్య ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకోనున్నాయి.

ఎంపిక చేసిన సంస్థలు ఒక్కో ఫ్లోటింగ్ రెస్టారెంట్, హౌస్‌బోట్ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒప్పంద కాలపరిమితి 10 సంవత్సరాలు కాగా, నిర్ణీత ప్రదేశాల్లో 12 నెలల్లోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

లాంజ్, వ్యూయింగ్ డెక్, రెస్టారెంట్ సౌకర్యాలతో పాటు లైఫ్ జాకెట్లు, లైఫ్‌బాయ్స్, అగ్నిమాపక పరికరాలు, జీపీఎస్ (GPS), నావిగేషన్ వంటి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేస్తారు. వాతావరణ పరిస్థితులకు లోబడి ఏడాది పొడవునా రోజుకు కనీసం ఒక ట్రిప్ చొప్పున క్రూజ్ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూపొందించిన తొలి పర్యాటక విధానం 'తెలంగాణ టూరిజం పాలసీ 2025–30' ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 3 లక్షల అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

హరిత-వెల్నెస్, ఆధ్యాత్మిక, చేతివృత్తులు, జల మరియు బౌద్ధ పర్యాటక రంగాలను కవర్ చేస్తూ ప్రభుత్వం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను, 6 టూరిజం క్లస్టర్లను గుర్తించింది. గ్లోబల్ సమిట్, టూరిజం కాంక్లేవ్ ద్వారా పర్యాటక రంగంలో ఇప్పటివరకు రూ.22,324 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వీటి ద్వారా సుమారు 90,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి వివరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More