ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో 750 ఎకరాలు సేకరించి ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Adilabad Airport : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూ సేకరణ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రక్షణ శాఖ కోరినట్లు మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే డిఫెన్స్ ఎక్స్‌పోకు రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు తమ ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఎక్స్‌పో-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు సూర్యకిరణ్ ఐఏఎఫ్, సారంగ్ ఐఏఎఫ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు.
స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీఓ ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలన్నారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాలు భూ సేకరణ చేపట్టిందని రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. రక్షణ శాఖ కోరినట్లు మొత్తం 1500 ఎకరాలు కోరినందున, మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల(DRDL) ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని చెప్పారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే దానిని మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉందని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


