హైడ్రా చేసే పనులను ఆపేది లేదు.. భవిష్యత్‌లోనూ కొనసాగిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా చేసే పనులను ఆపేది లేదని, దాని పనులను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి వేదికలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉందన్నారు.
యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి, వాటిని గందరగోళం చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలే భారంగా మారాయని, అయినా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, ముందస్తుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
'రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 2,200 నుంచి రూ. 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయి. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుంది. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండదు.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైడ్రా కారాచరణపైనా, నిర్వహిస్తున్న బాధ్యతలపైనా ప్రభుత్వానికి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


