రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు వచ్చాయనే వివరాలను వెల్లడించింది.
ఏ పార్టీకి ఎంత శాతం..?

ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం ఓట్లు రాగా… బీజేపీకి 15.67 శాతం దక్కాయి. స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్ బ్లాక్‌కు 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికలు జరిగగా…. వీటిలో కాంగ్రెస్ 1,347 వార్డుల్లో విజయం సాధించించింది. బీఆర్‌ఎస్ 717 వార్డుల్లో విజయం నమోదు చేయగా… బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో గెలిచారు.
36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల భారీగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.
ఇక 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల హంగ్ ఏర్పడటంతో ఆయా కార్పొరేషన్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా బీజేపీ సీట్లు గెలిచినప్పటికీ….. మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ - ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కరీంనగర్ లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.
ఇక కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. అయితే కాంగ్రెస్ - సీపీఐ కలిసి మేయర్ పీఠాన్ని పంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడి ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.