New Gas Connections : కొత్త గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్?

New Gas Connections : కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వెళ్లి అడిగితే సరైన సమాధానం దొరకడం లేదు.

Published on: Nov 17, 2026, 13:17:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కొత్త గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో నిలిపివేసిన కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియ, యుద్ధం ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ ఇప్పటికీ పునఃప్రారంభం కాలేదు. దాదాపు 9 నెలలుగా కొత్త కనెక్షన్లకు బ్రేక్ పడటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎల్పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్స్ (Unsplash)
ఎల్పీజీ గ్యాస్ కొత్త కనెక్షన్స్ (Unsplash)

మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రారంభమైన సమయంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉన్న వినియోగదారులకు(పాత కనెక్షన్లకు) సిలిండర్లు అందించడమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (IOCL, BPCL, HPCL) కష్టతరంగా మారింది. ఫలితంగా కొత్త కనెక్షన్ల మంజూరును తాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే యుద్ధం అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడినా పాత కనెక్షన్లపై విధించిన రీఫిల్లింగ్ నిబంధనలను ఆయిల్ కంపెనీలు సడలించాయి. ప్రస్తుతం పాత వినియోగదారులకు సిలిండర్ల సరఫరా యథావిధిగా సాగుతోంది. కానీ కొత్త కనెక్షన్ల జారీపై ఉన్న ఆంక్షలను మాత్రం నేటికీ ఎత్తివేయకపోవడం గమనార్హం.

కొత్త కనెక్షన్ల కోసం ప్రజలు నిత్యం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, తమకు పైస్థాయి నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ పోచారంలోని భారత్‌గ్యాస్ ఆఫీసుకు HT Telugu వెళ్లి అడగ్గా.. ఇంకా కొత్త కనెక్షన్లపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సిబ్బంది చెప్పుకొచ్చారు.

కొత్త గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియ నిలిచిపోవడం సామాన్య వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం వివాహ వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు, వివిధ కుటుంబ కార్యక్రమాలతో సందడిగా ఉన్నాయి. వీటన్నిటికీ అధిక మొత్తంలో వంటగ్యాస్ అవసరం. అయితే కొత్త గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వారు దానిని పొందలేకపోతున్నారు, ఇది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోంది.

కొత్తగా పెళ్లైన జంటలకు గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంది. కొత్త కనెక్షన్ల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల చాలామంది సాంప్రదాయ కట్టెల పొయ్యిలు లేదా ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడవలసి వస్తోంది.

గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసినప్పటికీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో లేకపోవడం ప్రజలలో నిరాశకు గురిచేస్తోంది. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో అడిగినప్పటికీ.. తమకు సరైన సమాచారం లభించడం లేదని చాలామంది చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో గ్యాస్‌కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కనెక్షన్ల జారీని వెంటనే పునఃప్రారంభించాలని గ్యాస్ కంపెనీలను, పంపిణీదారులను జనాలు కోరుతున్నారు. మరోవైపు బ్యాచిలర్స్ కూడా వంటకు ఇబ్బందులు పడుతున్నారు.

చాలా మంది మినీ సిలిండర్లపై ఆధారపడుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో వీటిని అధిక ధరలకు విక్రయించారు. 5 కేజీల సిలిండర్ ధరను కూడా అధిక ధరకు విక్రయిస్తున్నట్టుగా జనాలు వాపోతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్ అని ప్రశ్నిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More