తూర్పు దిశ నుంచి గాలులు.. తెలంగాణలో చలి పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో తూర్పు దిశ నుంచి గాలులు వీయనున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి ఎలా ఉండనుంది?
తెలంగాణ అంతటా ప్రస్తుతం కొనసాగుతున్న చల్లని రాత్రుల పరిస్థితి రాబోయే కొన్ని రోజుల్లో మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల స్థానంలో తూర్పు దిశ నుండి వీచే గాలులు రానున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో మిగిలిన శీతాకాలం అంతగా చలి లేకుండా సాధారణంగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల ప్రభావంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 18 డిగ్రీల మధ్య ఉన్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 14 డిగ్రీల నుండి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుండి 33 డిగ్రీల మధ్య ఉండగా, పలు జిల్లాల్లో 32 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు.
తూర్పు దిశ నుండి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో గాలిలో తేమ పెరిగి మేఘావృతమైన వాతావరణం ఏర్పడనుంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం, మిగిలిన శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం లేదు అని నిపుణులు అంటున్నారు.
రాబోయే రోజుల్లో అనుకున్నస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువే. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో కూడా రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణమే నమోదైంది. ఇటీవల ఏర్పడిన రెండు తుపానులతో రాష్ట్రం మెుత్తం ఆశించిన వర్షాలు కురవలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ వంటి కొన్ని జిల్లాలు మాత్రమే వర్షాలు పడ్డాయి.
నవంబర్ 13 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే నవంబర్ 19-20 తేదీల ప్రాంతంలో దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్టోబర్‌లో 86 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
సాధారణంగా డిసెంబర్ నాటికి సుమారు 11 సెం.మీ. వర్షపాతాన్ని అందించే ఈశాన్య రుతుపవనాలు, ఇప్పటివరకు కేవలం 3 సెం.మీ. వర్షపాతాన్ని మాత్రమే అందించాయి. దాదాపు 70 శాతం లోటు. జూన్ 1 నుండి నవంబర్ 11 వరకు తెలంగాణ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 83.9 సెం.మీ. కాగా, అది 64.5 సెం.మీ.గా నమోదైంది. ఇది 23 శాతం లోటును సూచిస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


