ఫేమస్ అవ్వడానికి కొంతమంది చేసే పనులు ఘోరంగా ఉంటున్నాయి. పవిత్రమై దేవాలయాల దగ్గర కూడా ఈ రీల్స్ పిచ్చి చాలామందికి ఎక్కువైపోయింది. ఏంకాదులే అని చేసే పనులతో చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొందరు యువకులు శివరాత్రినాడు శివుడికి గంజాయి ప్రసాదంగా సమర్పించారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

మహాశివరాత్రి రోజున గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందనే చెప్పాలి. దేవాలయం దగ్గర శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించారు కొందరు ప్రబుద్ధులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది బాగా వైరల్ అయింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే సజ్జనార్ స్పందించారు.
వీడియోలో కనిపించిన వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సజ్జనార్. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోగి దిగారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ధర్మగిరి దేవాలయం దగ్గర యువకులు శివుడికి ప్రసాదంగా గంజాయి సమర్పించినట్టుగా గుర్తించారు. దేవుడికి అందరూ కొబ్బరికాయ కొడతారు.. మేం మాత్రం ప్రత్యేకంగా గంజాయి ప్రసాదంగా సమర్పిస్తున్నాం అని యువకులు వీడియోలో చెప్పడం వినొచ్చు. ఇది కాస్త ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయింది. సజ్జనార్ దృష్టికి వెళ్లింది. యువకులు బడంగ్‌పేట్‌కు చెందిన చరణ్‌తోపాటుగా అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చేస్తున్నారు.
'దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం! మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు.. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే.. జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. లైకుల కోసం - లోకాన్నే మరిచి.. వ్యూస్ కోసం - విలువలనే వదిలి.. రీల్స్ కోసం - రోడ్డున పడి.. మత్తులో మునిగి - జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి.. వ్యసనాలకు వాకిలిగా కాదు.' అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.