ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. 12వ పీఆర్సీ కీలక ప్రకటన.. డిసెంబర్ 31 డెడ్‌లైన్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 12వ వేతన సవరణ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. వినతులు సమర్పించడానికి చివరి గడువు 2026 డిసెంబర్ 31గా నిర్ణయించింది.

Published on: Nov 20, 2026, 17:59:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ దిశగా 12వ వేతన సవరణ సంఘం(12th Pay Revision Commission-PRC) కీలక అడుగు వేసింది. ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు, సర్వీసు నిబంధనలకు సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలతో పాటు వ్యక్తిగత ఉద్యోగులను కమిషన్ ఆహ్వానించింది. ఇందుకు 2026 డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.

12వ పీఆర్సీ కీలక ప్రకటన
12వ పీఆర్సీ కీలక ప్రకటన

ఈ మేరకు 12వ పీఆర్సీ కార్యదర్శి డాక్టర్ పి. లక్ష్మీ నరసింహం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు కూడా తమ సర్వీసు సంబంధిత అంశాలపై సూచనలు పంపవచ్చని తెలిపారు. 12వ వేతన సవరణ సంఘం కింది విభాగాల ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీసు ప్రయోజనాలను సమీక్షించనుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల (Local Bodies) సిబ్బంది, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు.

విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు.

వర్క్-ఛార్జ్‌డ్ సిబ్బంది, పూర్తిస్థాయి కంటింజెంట్ ఉద్యోగులు.

ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్ వేతన స్కేళ్లు పొందుతున్న బోధనా సిబ్బందికి ఈ పీఆర్సీ వర్తించదు. అలాగే రెండో జాతీయ న్యాయ వేతన కమిషన్ పరిధిలోకి వచ్చే హైకోర్టు అధికారులు, రాష్ట్ర న్యాయ సేవల అధికారులకు కూడా మినహాయింపు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు కీలక అంశాలపై 12వ పీఆర్సీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. ప్రస్తుతం ఉన్న కరువు భత్యాన్ని (DA) మూలవేతనంలో (Basic Pay) విలీనం చేయడం, కొత్త పే స్కేళ్ల సవరణ, వేతన స్థిరీకరణను పరిశీలిస్తుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్, ప్రత్యేక వేతనాలు, కాంపెన్సేటరీ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని కమిషన్ సమీక్షిస్తుంది.

వివిధ కేటగిరీల పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించేందుకు ప్రమాణాలను రూపొందించనుంది. అలాగే రాష్ట్ర విభజన, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో సహా మొత్తం మానవ వనరుల అవసరాలను సమీక్షించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషన్ తన సిఫారసులను రూపొందించనుంది.

ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత ఉద్యోగులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలను డిసెంబర్ 31, 2026 లోపు లిఖితపూర్వకంగా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. పోస్టల్ చిరునామా: కార్యదర్శి, 12వ వేతన సవరణ సంఘం (12th PRC), రూమ్ నంబర్ 188, గ్రౌండ్ ఫ్లోర్, బిల్డింగ్ నంబర్ 4, ఆంధ్రప్రదేశ్ సచివాలయం, వెలగపూడి, అమరావతి-522238. ఈమెయిల్ ఐడీ: secytoprc-12@apfinance.gov.in

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1, 2026న విడుదల చేసిన జీవో నంబర్ 200 ద్వారా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ ఛైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి. లక్ష్మీ నరసింహంను కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 12, 2023న జారీ చేసిన జీవో నంబర్ 68 లోని విధివిధానాల ప్రకారం ఈ కమిషన్ పనిచేయనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More