...
...
Next Story

త్వరలో మహిళల కోసం ఏసీ బస్సులు కొనుగోలు.. సీఎం చంద్రబాబు హామీ

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో 26,401 మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు.

Published on: Sep 30, 2026, 17:39:36 IST
Advertisement

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ మహోత్సవంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్క విజయవాడలోనే 26,401 మందికి ఉచితంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం
పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం

విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, ఈ రోజు పేదల ఆత్మగౌరవానికి నిజమైన పట్టాభిషేకం జరిగిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60,000 మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఇవి రూ.19,000 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.52,000 కోట్ల విలువైన భూమిని పేదలకు అప్పగించామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరికీ సగటున 130 చదరపు గజాల చొప్పున కోటి నుంచి రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తి హక్కులు లభించాయని పేర్కొన్నారు.

ఇది తరతరాలకు ఉపయోగపడే వారసత్వ ఆస్తి అని, ఈ ఇళ్ల స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని, పిల్లల భవిష్యత్తు కోసం శాశ్వత నివాసాలు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు చంద్రబాబు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సర్వే పేరుతో ఊరూరా వివాదాలు సృష్టించి, ప్రజల పాస్‌బుక్కులపై, ఆస్తులపై నాయకుల బొమ్మలు ముద్రించుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తన ఫోటో కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కానీ పట్టాలపై ముద్రించలేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రతో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి అప్పగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు.

గతంలో అడ్డంకులు ఎదురైనా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి రైతులను ఆదుకున్నామని, ప్రకాశం బ్యారేజీ వద్దకు 490 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు అందిస్తున్నామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నాదేండ్ల మనోహర్, పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks