...
...
Next Story

వైఎస్ ఫ్యామిలీలో వివాదం.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ప్యాలెస్ ఇచ్చేందుకు జగన్ నో!

వైఎస్ కుటుంబంలోని ఆస్తుల విషయంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ప్యాలెస్ ఇచ్చేందుకు జగన్ నో చెప్పారని ప్రచారం నడుస్తోంది. దీనిపై షర్మిల స్పందించాల్సి ఉంది.

Published on: Oct 22, 2026, 15:35:24 IST
Advertisement

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ కుటుంబానికి చెందిన బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో మేనకోడలి వివాహానికి అనుమతించేందుకు నిరాకరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి సంబంధించిన ఈ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విజయమ్మ చెప్పినా వినని జగన్!

వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి, అమెరికాలో నివసిస్తున్న సోమల రఘురామిరెడ్డితో ఈ ఏడాది సెప్టెంబర్ 24న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 25వ తేదీన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో వేడుకగా వివాహం జరిపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే ప్యాలెస్‌లో పెళ్లికి సంబంధించిన అనుమతి కోసం తల్లి వైఎస్ విజయమ్మ ద్వారా జగన్‌ను షర్మిల సంప్రదించగా.. అందుకు జగన్ అంగీకరించలేదని సమాచారం.

ఈ ఆస్తి తన భార్య వైఎస్ భారతి రెడ్డి తల్లి పేరిట రిజిస్టర్ అయి ఉందని, అందుకే అక్కడ వివాహ వేడుకకు అనుమతించలేనని జగన్ తన తల్లికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విజయమ్మ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని సమాచారం.

కొత్త వేదిక కోసం షర్మిల సెర్చింగ్

ఇప్పటికే వైఎస్ షర్మిల బంధువులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులకు, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో పాటు కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కుటుంబ శ్రేయోభిలాషులు, విఐపీలు ఉన్నారు. అకస్మాత్తుగా ప్యాలెస్ అందుబాటులో లేకపోవడంతో, విఐపీల భద్రత, రవాణా వసతులకు తగినట్లుగా మరొక ప్రత్యామ్నాయ వేదికను వెతికే పనిలో షర్మిల బృందం పడింది.

యలహంక ఆస్తి వెనక అసలు వివాదం ఏమిటి?

హైదరాబాద్(లోటస్ పాండ్) ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే రెండు నివాసాలు నిర్మించారు. షర్మిల ప్రస్తుతం తన నివాసంలోనే ఉంటున్నారు. ఇడుపులపాయలో కూడా ఇద్దరికీ వేర్వేరు గృహాలు ఉన్నాయి. బెంగళూరు (యలహంక)లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రెండు పక్కపక్క ఇళ్లను నిర్మించారు. వైఎస్సార్ బెంగళూరు వచ్చినప్పుడల్లా ఇక్కడే విడిది చేసేవారు. జగన్ బెంగళూరు వెళ్లినప్పుడు తన ప్యాలెస్‌లోనే ఉంటారు.

అయితే షర్మిలకు కేటాయించిన ఇల్లు ఆమె పేరిట అధికారికంగా రిజిస్టర్ కాకపోవడం, 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో ఆస్తుల పంపిణీ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది కాలక్రమేణా ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఇవి కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఐదేళ్లుగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం

గత ఐదేళ్లుగా జగన్, షర్మిల మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లతో పాటు పలు కుటుంబ ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ విచారణలో ఉంది. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల వైఎస్సార్సీపీ తరఫున ఓదార్పు యాత్రలు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. అయితే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తుల పంపిణీ వ్యత్యాసాల వల్ల వీరి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి రాజకీయంగా తన సోదరుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో షర్మిలను వైసీపీ సోషల్ మీడియా తీవ్రస్థాయిలో టార్గెట్ చేసింది. జగన్‌‌ను దెబ్బకొట్టేందుకు షర్మిలను కూటమి పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మేనకోడలి పెళ్లికి ప్యాలెస్‌లో పర్మిషన్ ఇవ్వని విషయం కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో అసలు విషయం తెలియాల్సి ఉంది. దీనిపై షర్మిల ఏం మాట్లాడుతారా అనే ఆసక్తి నెలకొంది. ఏదైనా రాజకీయ వేదిక మీద జగన్‌పై ఈ విషయం గురించి కచ్చితంగా షర్మిల కామెంట్స్ చేసే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks