...
...
Next Story

AP Cabinet Decisions : రాజధాని రైతుల రుణాలు మాఫీ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అమరావతి రైతులకు రుణమాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Published on: Jul 10, 2026, 20:10:36 IST
Advertisement

AP Cabinet Decisions : రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు భారీగా ఉపాధి కల్పించేలా రూ.11,569.91 కోట్ల విలువైన 13 పెట్టుబడి ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా రాష్ట్రంలో కొత్తగా 31,431 ఉద్యోగాలు రానున్నాయి. వీటితో పాటు అమరావతి రాజధాని రైతుల రుణమాఫీ, సోషల్ మీడియా దుర్వినియోగంపై కట్టడి వంటి కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సమావేశం ముగిసిన అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ… కేబినెట్ నిర్ణయాల వివరాలను వెల్లడించారు. 19వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదించిన అన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, రాయితీలు కల్పిస్తామన్నారు.

ప్రముఖ సంస్థ మొండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ.1,801 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని, దీనికి సాంకేతిక ఆధునికీకరణ, స్థిర మూలధన పెట్టుబడి, విద్యుత్ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విస్తరణతో చాక్లెట్ తయారీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అమరావతిలో రెండో విడత కింద భూములు ఇచ్చిన 7 గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది.

కేబినెట్ సమావేశంలోని ఇతర ముఖ్య నిర్ణయాలు :

  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ (బహుళ గ్రామ ఉమ్మడి తాగునీటి పథకాలు) చేపట్టేందుకు ఆమోదం.
  • విశాఖపట్నంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అనుమతి.
  • రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, ప్రచార కార్యక్రమాల కోసం రూ.50 కోట్లు కేటాయింపు. నెల్లూరులోని ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటళ్లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు. కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
  • విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఏర్పాటు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ-జేఈఈ, నీట్ (NEET) రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలకు ఆమోదం.
  • పెద్దగెడ్డ రిజర్వాయర్ ఆయకట్టు ఆధునికీకరణ పనులకు అనుమతి. కుప్పం నియోజకవర్గంలో ఫీడర్ ఛానెల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆమోదం.
  • సీఆర్డీఏ (CRDA) పరిధిలో ఆమోదం పొందిన వివిధ సంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks