AP CID Arrests Fake Job Racket : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని, నకిలీ నోటిఫికేషన్లతో రూ. లక్షలు కొల్లగొడుతున్న ఒక ముఠా గుట్టును ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ సీఐడీ పోలీసులు రట్టు చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక యువతను బురిడీ కొటించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ప్రధాన నిందితుడు గోపాల్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు.
నకిలీ పేపర్ ప్రకటనలతో వల…..

ఆంధ్రప్రదేశ్ సీఐడీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నిందితుడు గోపాల్ ఈ నకిలీ ఉద్యోగాల రాకెట్‌ను నడుపుతున్నాడు. 2021లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో ఒక నకిలీ వార్తాపత్రిక ప్రకటనను ప్రచురించాడు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఒక నకిలీ ఈమెయిల్ ఐడీని కూడా ఆ ప్రకటనలో ఇచ్చాడు. ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు పంపిన వ్యక్తిగత వివరాలను, బయోడేటాలను సేకరించిన గోపాల్, ఆ తర్వాత నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ప్రభుత్వ ఉద్యోగం ఖాయంగా ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగటం ప్రారంభించాడు.
నమ్మకం కుదిరించేందుకు నిందితుడు ఏకంగా భారత ప్రభుత్వ అధికారిక రాజముద్ర , కేంద్ర ఆరోగ్య శాఖ పేరు, నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ అధికారిక చిరునామాలను దుర్వినియోగం చేశాడు. నకిలీ నియామక నోటిఫికేషన్లు, సర్టిఫికేట్ పరిశీలన లేఖలు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, నియామక ఉత్తర్వులు, ట్రైనింగ్ ఆర్డర్లను పక్కాగా సృష్టించి అభ్యర్థులకు పంపాడు. ఈ పత్రాలను నిజమైనవేనని నమ్మిన పలువురు బాధితులు, వెరిఫికేషన్, ఉద్యోగంలో చేరే ప్రక్రియ కోసం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భవనానికి రావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
పోలీసులను, నిఘా వర్గాలను తప్పుదోవ పట్టించేందుకు గోపాల్ అత్యంత వినూత్నమైన నేర విధానాన్ని ఎంచుకున్నాడు. OLX ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకుని, వారి బ్యాంక్ ఖాతాలను 'మ్యూల్ ఖాతాలు' (Mule Accounts)గా వాడుకున్నాడు. బాధితుల నుంచి వచ్చే డబ్బులను నేరుగా ఆ ఖాతాల్లో వేయించేవాడు. ఇందుకుగానూ ఆ ఖాతాదారులకు 30 శాతం కమిషన్ ఇచ్చి, మిగిలిన 70 శాతం డబ్బును తనే ఉంచుకునేవాడు. వారి ఏటీఎం కార్డులను కూడా తన వద్దే పెట్టుకుని డబ్బులు విత్‌డ్రా చేసేవాడు.
{{/usCountry}}పోలీసులను, నిఘా వర్గాలను తప్పుదోవ పట్టించేందుకు గోపాల్ అత్యంత వినూత్నమైన నేర విధానాన్ని ఎంచుకున్నాడు. OLX ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకుని, వారి బ్యాంక్ ఖాతాలను 'మ్యూల్ ఖాతాలు' (Mule Accounts)గా వాడుకున్నాడు. బాధితుల నుంచి వచ్చే డబ్బులను నేరుగా ఆ ఖాతాల్లో వేయించేవాడు. ఇందుకుగానూ ఆ ఖాతాదారులకు 30 శాతం కమిషన్ ఇచ్చి, మిగిలిన 70 శాతం డబ్బును తనే ఉంచుకునేవాడు. వారి ఏటీఎం కార్డులను కూడా తన వద్దే పెట్టుకుని డబ్బులు విత్‌డ్రా చేసేవాడు.
{{/usCountry}}బాధితుల్లో మరింత నమ్మకాన్ని పెంచేందుకు 'ఆయుష్మాన్ భారత్ ఫౌండేషన్' పేరుతో ఒక బ్యాంక్ ఖాతాను సైతం తెరిచాడు. ఇవే కాకుండా సమావేశాలకు వెళ్లే సమయంలో తాను ఒక సీనియర్ ప్రభుత్వ అధికారినని కలరింగ్ ఇచ్చేందుకు అద్దె కార్లను ఉపయోగించేవాడని విచారణలో తేలింది.
సీఐడీ దర్యాప్తులో నిందితుడి కిలాడీ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. నకిలీ కేవైసీ (KYC) పత్రాలతో పొందిన 15 మొబైల్ నంబర్లు, అనేక నకిలీ ఈమెయిల్ ఐడీలను అతను ఉపయోగించాడు. అంతేకాకుండా, కేవలం ఒకే ఒక్క మొబైల్ నంబర్‌కు ఏకంగా 278 ఐఎంఈఐ (IMEI) సంఖ్యలు అనుసంధానమై ఉన్నట్లు సాంకేతిక విశ్లేషణలో తేలింది.
విజయవాడలో తిరుగుతున్న సమయంలో పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేవాడు. అయినప్పటికీ సీఐడీ బృందం డిజిటల్ ఆధారాలను నిశితంగా విశ్లేషించి, సాంకేతిక పరిజ్ఞానం మరియు నిఘా వ్యవస్థ సహాయంతో అతని అడ్రస్ కనుగొని అరెస్ట్ చేసింది.
రూ. 93 లక్షల వసూలు – 16 కేసులు నమోదు
ప్రాథమిక విచారణ ప్రకారం… నిందితుడు గోపాల్ సుమారు 60 మంది బాధితుల నుంచి రూ. 93 లక్షల వరకు వసూలు చేసినట్లు తేలింది. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే 16కి పైగా ఉద్యోగ మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కుట్రలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా, ఇతర బాధితులు ఉన్నారా అనే కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.
మోసం ద్వారా సంపాదించిన డబ్బును నిందితుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు విజయవాడలోని పటమట ప్రాంతం నుంచి నిందితుడు ప్రభుత్వ ముద్రలు, సీళ్లను సేకరించినట్లు తేలడంతో ఆ కోణంలోనూ విచారణ వేగవంతం చేశారు.
మధ్యవర్తులను నమ్మి వెనుక తలకదవుల ద్వారా లేదా డబ్బులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని చూసి మోసపోవద్దని నిరుద్యోగ యువతకు ఏపీ సీఐడీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలను కేవలం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రకటనల ద్వారా మాత్రమే సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.