...
...
Next Story

CM CBN Cycle Rally : వైజాగ్ సిటీలో సీఎం చంద్రబాబు సైకిల్‌ సవారీ - ఐదున్నర కి.మీ. ప్రయాణం

CM Chandrababu Cycle Rally Vizag : ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఆయన మొక్కలు నాటి, ఐదున్నర కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

Published on: Jun 5, 2026, 15:57:13 IST
Advertisement

CM Chandrababu Cycle Rally Vizag : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ (పచ్చదనం) సాధించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రోజురోజుకూ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతోనే ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు అకాల తుఫానులు ముంచెత్తుతున్నాయని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉందని పిలుపునిచ్చారు.

స్టీల్ సిటీలో సీఎం సైకిల్‌ సవారీ
స్టీల్ సిటీలో సీఎం సైకిల్‌ సవారీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పర్యావరణ దినోత్సవ సదస్సు ప్రారంభానికి ముందు ఏయూ ప్రాంగణంలో ముఖ్యమంత్రి స్వయంగా ఒక మొక్కను నాటారు.

ఆంధ్ర యూనివర్సిటీకి గ్రీనరీ మోడల్ - సీఎం

తిరుమల కొండలపై ఏ విధంగానైతే దట్టమైన అడవులు, పచ్చదనం పరుచుకుని ఉంటాయో… అదే తరహాలో ఏయూ క్యాంపస్‌లోనూ గ్రీనరీని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వర్సిటీ క్యాంపస్‌లో కేవలం 25 శాతమే పచ్చదనం ఉందని, దీనిని యుద్ధప్రతిపాదికన 50 శాతానికి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏయూ వైస్ ఛాన్సలర్‌ను (వీసీ) సీఎం ఆదేశించారు.

అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏయూ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు. "స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా మారాలి. దీనిని పూర్తిగా నెట్ జీరో క్యాంపస్‌గా తీర్చిదిద్దాలి. ఆంధ్ర యూనివర్శిటీకి 450 ఎకరాల సువిశాలమైన భూమి ఉంది. ఈ క్యాంపస్‌లోని ఖాళీ ప్రదేశాలన్నింటినీ చెట్లతో నింపేయాలి. కేవలం చెట్లు నాటడమే కాకుండా, వర్సిటీలోని అన్ని ప్రధాన భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి. క్యాంపస్‌కు అవసరమైన విద్యుత్‌ను ఇక్కడే సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పటికే తీసుకున్న కొన్ని చర్యల వల్ల రూ.5,18,000 విలువైన విద్యుత్ ఆదా కావడం మంచి పరిణామం," అని సీఎం చంద్రబాబు వివరించారు.

క్యాంపస్‌లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, వర్సిటీ పరిధి నుంచి ఒక్క చుక్క నీరు కూడా వృథాగా బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. శుద్ధి చేసిన మురుగు నీటిని (రీసైకిల్డ్ వాటర్) క్యాంపస్‌లోని చెట్లకు, గార్డెనింగ్‌కు ఉపయోగించాలని చెప్పారు. హాస్టళ్లలో వంటల కోసం పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) లేదా ఎలక్ట్రికల్ స్టవ్స్‌ మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెట్ జీరో విధానాన్ని పక్కాగా అమలు చేయడానికి ప్రొఫెసర్లతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని (టీమ్) ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, సిబ్బంది తిరగడానికి ఎలక్ట్రికల్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

విశాఖపట్నం నగరంలో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు విశాఖ పోర్టు ట్రస్ట్ దగ్గర నుంచి మొదలుకుని నగరంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎవరైతే తమ నియోజకవర్గాల్లో మొక్కలు బాగా పెంచి పచ్చదనాన్ని కాపాడతారో, వాళ్లకే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి నవ్వులు పూయించారు. రాష్ట్రంలో ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) చల్లడం ద్వారా అడవులను, గ్రీనరీని పెంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

5.5 కిలోమీటర్లు సీఎం సైకిల్ ర్యాలీ!

మీడియా సమావేశం ముగిసిన వెంటనే పర్యావరణ పరిరక్షణ, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో మరియు యువతలో చైతన్యం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ ఎక్కారు. విశాఖలో ఎర్రటి ఎండ కాస్తున్నప్పటికీ… లెక్కచేయకుండా సీఎం ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలబడిన వేలాది మంది ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీని ముందుకు నడిపించారు.

ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ జంక్షన్, పోలమాంబ గుడి, వుడా పార్క్, వైఎంసీఏ మీదుగా ప్రసిద్ధ బీచ్ రోడ్‌లోని నోవోటెల్ హోటల్ వరకు సాగింది. ముఖ్యమంత్రి ఏకంగా ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని కేవలం 21 నిమిషాల్లోనే సైకిల్‌పై చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు, వందలాది మంది స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, స్థానిక యువకులు ఉత్సాహంగా సైకిళ్లు తొక్కుతూ పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks