AP Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు - రూ.4,026 కోట్లతో మాస్టర్ ప్లాన్!
Godavari Pushkaralu : 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రూ.4,026 కోట్లతో 4,932 పనులను చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Godavari Pushkaralu : ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనల కలయికగా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడా నదీ పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కర వేడుకలు జరగనున్నాయి.

అమరావతి సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. పుష్కరాల నిర్వహణలో కేవలం ప్రభుత్వమే కాకుండా స్థానిక ప్రజలను సైతం భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పుష్కరాల కోసం రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్కర ప్రారంభానికి ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉన్నందున, అన్ని పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని హెచ్చరించారు.
ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లను ఆర్థిక శాఖ కేటాయించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో అత్యధిక పనులు జరుగుతున్నాయి.
జిల్లాల వారీగా అభివృద్ధి పనుల వివరాలు:
- తూర్పు గోదావరి జిల్లా : 1,869 పనులు
- కోనసీమ జిల్లా : 1,501 పనులు
- పశ్చిమ గోదావరి జిల్లా : 625 పనులు
- ఏలూరు జిల్లా : 426 పనులు
- కాకినాడ జిల్లా : 321 పనులు
- పోలవరం జిల్లా : 190 పనులు
ఈ పనుల పూర్తికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్న నిధులను కూడా తీసుకోవాలని సీఎం సూచించారు.
2027 పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు…?
గతంలో 2015లో జరిగిన మహా పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. 2027లో ఈ సంఖ్య 8 నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పుష్కరాల సమయంలో రోజుకు సగటున కోటి మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో పాతవి 259 ఘాట్లను ఆధునీకరించడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు.
జిల్లాల వారీగా ఘాట్ల వివరాలు:
- కోనసీమ జిల్లా: 175 ఘాట్లు
- కాకినాడ జిల్లా: 88 ఘాట్లు
- తూర్పు గోదావరి జిల్లా: 82 ఘాట్లు
- ఏలూరు జిల్లా: 44 ఘాట్లు
- పశ్చిమ గోదావరి జిల్లా: 40 ఘాట్లు
- పోలవరం జిల్లా: 11 ఘాట్లు
గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించాలని సీఎం నిర్దేశించారు. పిఠాపురం శక్తిపీఠం, పంచారామాల్లోని 4 క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ ఆలయాలను ఈ సర్క్యూట్‌లో చేర్చాలని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు 'హోమ్ స్టే' సంస్కృతిని ప్రోత్సహించాలని, కొత్తగా హోటళ్ల నిర్మాణానికి వచ్చే ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సూచించారు. దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానాలు పంపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విశిష్టతను ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను ఒక అవకాశంగా మలుచుకోవాలని పేర్కొన్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు సంయుక్త ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
పుష్కర ఘాట్లను కలిపే రహదారులతో పాటు 6 జిల్లాల్లోని ప్రధాన రహదారుల్లో ఎక్కడా గుంతలు లేకుండా నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును భక్తులు సందర్శించేలా ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేయాలని, బ్రిడ్జిల సామర్థ్యాన్ని పరీక్షించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గోదావరి నదిలో చుక్క మురుగు నీరు కూడా కలవకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హేవ్‌లాక్ బ్రిడ్జి, సమీపంలోని దీవుల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
పక్కాగా నిఘా…
ఈసారి పుష్కర భద్రత, రద్దీ నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏఐ (AI) ఆధారిత క్రౌడ్ అనలిటిక్స్, సిసిటివి ఎంట్రీ-ఎగ్జిట్ మానిటరింగ్, డ్రోన్ సర్వైలెన్స్, క్యూఆర్ కోడ్ ఆధారిత వాహన గుర్తింపు వ్యవస్థ, డీసెంట్రలైజ్డ్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
భక్తుల ఆరోగ్యం కోసం 30 తాత్కాలిక ఫీల్డ్ ఆసుపత్రులను, మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యవేక్షణ కోసం పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నారు. భక్తుల భద్రత కోసం గోదావరి నదిలో 2,697 రెస్క్యూ బోట్లను సిద్ధం చేయడంతో పాటు 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని 260 గ్రామ పంచాయతీలలో 50 పంచాయతీలను 'మోడల్ పుష్కర పంచాయతీలు'గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని 'మునికూడలి' గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. కొవ్వూరు–పోలవరం మీదుగా పట్టిసీమ రోడ్డు, సీతానగరం నుంచి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వరకు బిటి రోడ్డు, అవెన్యూ ప్లాంటేషన్, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. రాజమహేంద్రవరం–పోలవరం మధ్య జాతీయ రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 487 గ్రీన్ ఎనర్జీ బస్సులను నడపడంతో పాటు 11 బస్టాండ్లను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నారు.
గోదావరి నది జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు అందులో కలుస్తున్నందున, ఈ వేడుకలను ‘అఖండ గోదావరి’ పేరుతో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

