...
...
Next Story

AP Free Dialysis Centres : త్వ‌ర‌లో కొత్తగా 22 డయాలసిస్‌ కేంద్రాలు - ఎక్కడెక్కడంటే..

AP Free Dialysis Centres : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవలను మరింత చేరువ చేస్తూ ఏపీలో కొత్తగా 22 కేంద్రాలను ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంతో పేద రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.

Published on: Oct 14, 2026, 10:32:41 IST
Advertisement

రాష్ట్రంలో కిడ్నీ (మూత్రపిండాల) వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు మెరుగైన, ఉచిత వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం (PMNDP) కింద ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. రోగుల అత్యవసర అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

డయాలసిస్ (image source Pixel)
డయాలసిస్ (image source Pixel)

రాష్ట్రంలో ఇప్పటికే పీఎంఎన్‌డీపీ కింద 61 డయాలసిస్ కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న 22 కేంద్రాలతో కలిపి ఈ సంఖ్య మొత్తం 83కి చేరనుంది. ఇది కాకుండా…. డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్ర‌స్టు ద్వారా మరో 170 కేంద్రాల్లో బాధితులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా ఉచితంగా అందిస్తున్న డయాలసిస్ సేవల నిమిత్తం ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.197.88 కోట్లు వెచ్చించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.90.09 కోట్ల విలువైన ఉచిత సేవలను పేద రోగులకు అందించడం విశేషం.

పేదలకు తప్పనున్న ఆర్థిక భారం

ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అవుతోంది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి నెలకు కనీసం 4 నుంచి 5 సార్లు రక్తశుద్ధి చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బాధితుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే, ప్రభుత్వ కేంద్రాల్లో ఒక్కో డయాలసిస్‌కు ప్రభుత్వం రూ.999 చొప్పున వ్యయం చేస్తూ ఉచితంగా సేవలు అందిస్తుండటం వల్ల వేలాది పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తోంది.

22 కొత్త కేంద్రాలు ఎక్కడంటే..?

  • పశ్చిమగోదావరి : భీమవరం ఏరియా ఆసుపత్రి
  • చిత్తూరు : పీలేరు ఏరియా ఆసుపత్రి
  • వైఎస్సార్‌ కడప : జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి, మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)
  • కృష్ణా : గన్నవరం సీహెచ్‌సీ, గుడివాడ ఏరియా ఆసుపత్రి
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు : వెంకటగిరి, ఉదయగిరి సీహెచ్‌సీలు
  • బాపట్ల : అద్దంకి, రేపల్లె సీహెచ్‌సీలు
  • తిరుపతి : రైల్వేకోడూరు, సత్యవేడు సీహెచ్‌సీలు
  • ప్రకాశం : కొండెపి సీహెచ్‌సీ
  • తూర్పుగోదావరి: కొవ్వూరు సీహెచ్‌సీ
  • ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామ సీహెచ్‌సీ
  • పల్నాడు : వినుకొండ సీహెచ్‌సీ, సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి
  • విజయనగరం: బొబ్బిలి సీహెచ్‌సీ
  • నంద్యాల: డోన్ ఏరియా ఆసుపత్రి, సున్నిపెంట సీహెచ్‌సీ
  • శ్రీ సత్యసాయి: పెనుకొండ సీహెచ్‌సీ, మడకశిర ఏరియా ఆసుపత్రి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks