ఏపీపై 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్ : అత్యంత భారీ వర్ష హెచ్చరికలు - తీర ప్రాంత రహదారులు బంద్..! రంగంలోకి NDRF బృందాలు
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్ర తుపానుగా బలపడింది. అక్టోబర్ 28న ఏపీ తీరం దాటనుంది. సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం రూ.27 కోట్లు విడుదల చేసి, 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది.
అర్నబ్' తుఫాను అత్యంత భయానక రూపం దాల్చుతోంది. మరో మరికొన్ని గంటల్లో ఇది 'అతి తీవ్ర తుఫాను'గా మారి, అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించనుందని భారత వాతావరణ శాఖ (IMD) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం వేళ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల – విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సందర్భాల్లో గాలి వేగం 140 కిలోమీటర్ల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నిధులు విడుదల…
తుఫాన్ ధాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ ఉపశమనం కోసం 20 జిల్లాలకు కలిపి రూ.27 కోట్ల నిధులను విడుదల చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
- అత్యధిక ముప్పు పొంచి ఉన్న బాపట్ల, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ మరియు అనకాపల్లి జిల్లాలకు చెరో రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారు.
- శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలకు చెరో రూ.1 కోటి చొప్పున కేటాయించారు.
- ఈ నిధులను పునరావాస కేంద్రాల నిర్వహణ, బాధితులకు తాగునీరు, ఆహారం, పాలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు, దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం వినియోగిస్తారు.
తీర ప్రాంత రోడ్లు మూసివేత…
ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా బీచ్లను పూర్తిగా మూసివేశారు. ప్రమాదాలను నివారించేందుకు మంగళవారం మధ్యాహ్నం నుంచి తీర ప్రాంత రోడ్లలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా 2,613 అత్యవసర వాటర్ ట్యాంకర్లను నిరంతర సరఫరా కోసం సిద్ధంగా ఉంచారు.
తుఫాను దెబ్బకు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొత్తం 15 జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలను మోహరించారు. కాకినాడ, అమలాపురం (నాడిపూడి), రాజమండ్రి, ఏలూరు, నర్సాపురం, మచిలీపట్నం, నక్కపల్లి పరిధిలో ఈ బృందాలను సిద్ధంగా ఉంచారు. యానాం పరిధిలో 2 బృందాలను, కృష్ణా జిల్లాలోని ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం వద్ద 3 బృందాలను, విశాఖపట్నంలోని రీజినల్ రెస్పాన్స్ సెంటర్లో 3 బృందాలను అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
అత్యంత భారీ వర్షాలు…
అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తా ఆంధ్రతో పాటు యానాంలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 27న గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తే, 28న తీరం దాటే సమయంలో 125 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉందని, తదుపరి రోజుల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని వివరించింది.
ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాలు, 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 పట్టణ ప్రాంతాలపై ఈ 'అర్నబ్' తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 1,763 తుఫాను పునరావాస కేంద్రాలను గుర్తించారు. జిల్లా, మండల స్థాయిల్లో 2,907 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కోసం 3,185 మంది నోడల్ అధికారులను నియమించారు. 2,107 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు యూనిట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

