ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) పరిశోధన, ఆధునిక సాంకేతిక వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, అలాగే సెమీకండక్టర్ల విభాగాల్లో అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల క్లస్టర్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన 'క్వాంటమ్-ఎన్‌హాన్స్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఫర్ ఏఐ సిస్టమ్స్' (QUEST-AI) అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
శతాబ్ది ఉత్సవాల వేడుకలు విజయవంతంగా ముగిసిన అనంతరం, విశ్వవిద్యాలయంలో నాణ్యమైన అభివృద్ధి కార్యకలాపాలపై పూర్తి దృష్టి సారించామని వైస్-ఛాన్సలర్ తెలిపారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు రాబోయే 2-3 ఏళ్లలో విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత మూడు ల్యాబొరేటరీలను నిర్మించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపే విధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసిన ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. క్వాంటమ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 'నేషనల్ క్వాంటమ్ మిషన్'ను ప్రారంభించిందని తెలిపారు. భవిష్యత్తు సాంకేతిక పరిణామాలపై ఆయన మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ కంప్యూటింగ్‌ను పూర్తిగా భర్తీ చేయదన్నారు. రాబోయే రోజుల్లో ఇవి రెండూ కలిపి పనిచేసే హైబ్రిడ్ మోడల్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం క్వాంటమ్ వ్యాలీ మాత్రమే కాకుండా, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు మరియు ఐబీఎమ్, టీసీఎస్ వంటి ప్రముఖ గ్లోబల్ భాగస్వాములను ఒకే చోటకు చేర్చి ఒక ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్-ఏఐ వ్యవస్థను నిర్మించే అద్భుత అవకాశం ఉందని సత్యనారాయణ తెలిపారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం క్వాంటమ్ వ్యాలీ మాత్రమే కాకుండా, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు మరియు ఐబీఎమ్, టీసీఎస్ వంటి ప్రముఖ గ్లోబల్ భాగస్వాములను ఒకే చోటకు చేర్చి ఒక ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్-ఏఐ వ్యవస్థను నిర్మించే అద్భుత అవకాశం ఉందని సత్యనారాయణ తెలిపారు.
{{/usCountry}}విశాఖపట్నం నగరం వేగంగా డేటా సెంటర్ల కేంద్రంగా మారుతోందని, ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ఈ డేటా సెంటర్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఇలాంటి భారీ డేటా సెంటర్లకు అధిక మొత్తంలో విద్యుత్, నీరు అవసరమవుతాయని, అందుకే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు'సుస్థిరత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.