Tiruchanur Teppotsavam 202 6 : ఈనెల 25 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు- ఐదు రోజుల షెడ్యూల్ ఇదే!

Tiruchanur Ammavari Teppotsavam 2026 : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29 వరకు వైభవంగా జరగనున్నాయి. వాహన సేవలు, స్నపన తిరుమంజనం, ఆర్జిత సేవల రద్దు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి . 

Published on: Jun 15, 2026, 06:14:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tiruchanur Padmavathi Ammavari Teppotsavam 2026 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ అలమేలుమంగ తల్లి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

పాంచరాత్ర ఆగమ సంప్రదాయాల ప్రకారం అత్యంత నిష్టతో నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మసరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకోనున్నారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ తెప్పోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భక్తుల కష్టాలు, సంసార బంధనలు తొలగిపోతాయి. అలమేలుమంగ దైవానుగ్రహంతో పాటు సర్వసౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తుల బలమైన నమ్మకం. పద్మసరస్సులోని బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన జగజ్జనని శ్రీ పద్మావతి అమ్మవారు, భక్తులను భవసాగరంలో మునిగిపోకుండా రక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ తెప్పోత్సవాలు చాటిచెబుతాయి.

ఐదు రోజుల ఉత్సవాల షెడ్యూల్:

ఈ ఐదు రోజుల పాటు రోజుకో అవతారంలో దైవ స్వరూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

  • జూన్ 25 (మొదటి రోజు): రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం
  • జూన్ 26 (రెండవ రోజు): శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం
  • జూన్ 27 నుండి 29 వరకు (చివరి మూడు రోజులు): శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
  • ఉత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజుల పాటు (జూన్ 27, 28, 29) పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహించనున్నారు.

గజ, గరుడ వాహన సేవలు:

తెప్పోత్సవాల కాలంలో ప్రత్యేక వాహన సేవలు కూడా జరగనున్నాయి. జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవను, అలాగే జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు వైభవంగా గరుడ వాహన సేవను నిర్వహించనున్నారు. జలవిహారం పూర్తయిన తర్వాత ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు వైభవంగా సాగనుంది.

ఆర్జిత సేవలు రద్దు :

ఈ ఐదు రోజుల పాటు ఆలయంలో రద్దీని నియంత్రించేందుకు, ఉత్సవాలను ఏకాగ్రతతో నిర్వహించేందుకు గాను కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. జూన్ 25 నుండి 29 వరకు అమ్మవారి ఆలయంలో నిత్యం నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను పూర్తిగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు జూన్ 26న జరగాల్సిన లక్ష్మీపూజను కూడా రద్దు చేశారు.

ఈ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలో భక్తి సంగీత కచేరీలు, పండితులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నారు. అలమేలుమంగ తల్లి దివ్య కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More