...
...
Next Story

అక్టోబర్‌లో వృద్ధుల కోసం డోర్-టు-డోర్ హెల్త్ చెకప్స్.. ఇంట్లోనే ఫిజియోథెరపీ కూడా!

అక్టోబర్‌లో వృద్ధుల కోసం ఇంటింటికీ ఆరోగ్య సేవల కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనిద్వారా వృద్దుల ఆరోగ్యపరిస్థితులు తెలుసుకొని, సరైన చికిత్స అందించనున్నట్టుగా వెల్లడించారు.

Published on: Sep 30, 2026, 22:18:06 IST
Advertisement

వృద్ధులలో ఆరోగ్య సమస్యలను ముందస్తు దశలోనే గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన వైద్య సేవలను అందించేందుకు అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక వైద్య కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

వృద్ధులకు హెల్త్ చెకప్
వృద్ధులకు హెల్త్ చెకప్

అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. వృద్ధులు ఆసుపత్రులకు వచ్చే వరకు వేచి ఉండకుండా ఆరోగ్య బృందాలు వారి ఇళ్ల వద్దకే చేరుకుంటాయని తెలిపారు. ఈ బృందాలు వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఫిజియోథెరపీ, పునరావాస సేవలను అందిస్తాయి.

ప్రతి ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్త ప్రతి వారం కనీసం ఐదుగురు వృద్ధుల ఇళ్లను సందర్శించి ఫిజియోథెరపీ, ఇతర సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. Comprehensive Geriatric Assessment(CGA) సాధనాన్ని ఉపయోగించి ప్రతి జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రిలో కనీసం 1,000 మంది వృద్ధుల నుండి ప్రశ్నావళి ఆధారిత మదింపుల ద్వారా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. సేకరించిన సమాచారం ఆధారంగా తగిన చికిత్స, సంరక్షణ అందిస్తామని అన్నారు.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధిక రక్తపోటు, మానసిక ఆరోగ్యం, ఫిజియోథెరపీ, పునరావాసం, వృద్ధులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా మంత్రి వెల్లడించారు. ప్రతి గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వంట చేయడం, కిరాణా సామాను కొనడం, ప్రయాణం చేయడం లేదా ఇంటి బయటకు వెళ్లడం, దినచర్యలను స్వతంత్రంగా నిర్వహించుకోవడం వంటి నిత్యావసర దైనందిన కార్యకలాపాలలో ఇబ్బందులను కూడా ఈ బృందాలు గుర్తించాయి. సర్వే ద్వారా గుర్తించిన వారికి కౌన్సెలింగ్, చికిత్స, ఇతర సహాయక సేవలు అందించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks