...
...
Next Story

AP Job Calendar 2026 : ఆంధ్రప్రదేశ్‌లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు.. జాబ్‌ క్యాలెండర్‌ 2026 విడుదల

AP Job Calendar 2026 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ మొత్తం 10,060 ఖాళీల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ 2026ను విడుదల చేసింది.

Published on: Aug 22, 2026, 18:50:17 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగార్థులకు భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 ప్రత్యక్ష నియామక పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ 2026ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పీయూష్ కుమార్ జీఓ ఎంఎస్ నంబర్ 81 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఈ పోస్టులను నాలుగు విడతల్లో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం సకాలంలో పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీ, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వంటి నియామక సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది.

నాలుగు విడతల్లో

ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఈ మొత్తం ఉద్యోగాలను ఒకేసారి కాకుండా నాలుగు వేర్వేరు విడతల్లో భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు వరుసగా వెలువడనున్నాయి.

మొదటి విడత (1,523 పోస్టులు): ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ఇదివరకే మే 15న ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

రెండో విడత (3,231 పోస్టులు): సెప్టెంబర్ 15న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా 149 గ్రూప్-1 పోస్టులతో పాటు పోలీస్, అటవీ, పశుసంవర్ధక తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

మూడో విడత (2,311 పోస్టులు): అక్టోబర్ 15న మూడో విడత ప్రకటన వెలువడనుంది. కీలకమైన 673 గ్రూప్-2 ఖాళీలు, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను ఈ విడతలోనే భర్తీ చేయనున్నారు.

నాలుగో విడత (2,995 పోస్టులు): ఇది కూడా అక్టోబర్ 15న విడుదల కానుంది. విద్యాశాఖలో భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటనను ఇచ్చి భర్తీ ప్రక్రియను చేపడతారు.

శాఖల వారీగా భర్తీ అయ్యే ప్రధాన ఉద్యోగాలు

గ్రూప్-1 (14 పోస్టులు): డిప్యూటీ కలెక్టర్ (3), డీఎస్పీ సివిల్ (1), మ్యూనిసిపల్ కమిషనర్ గ్రేడ్-2 (1), ఆర్టీఓ (1), డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (1), జిల్లా గిరిజన సంక్షేమాధికారి (1) తదితర పోస్టులు ఉన్నాయి.

పోలీస్ కానిస్టేబుల్ సివిల్ (542), ఏఆర్‌ (205), ఏపీఎస్‌పీ (80), ఎస్‌ఐ సివిల్ (182), ఏఆర్‌ ఎస్‌ఐ (116) పోస్టులతో పాటు ఫైర్‌మెన్ (158), జైళ్ల శాఖలో వార్డర్ (150) ఉద్యోగాలు ఉన్నాయి.

పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (164), అటవీ శాఖ బీట్ ఆఫీసర్/ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ (196), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నాయి.

ఫేజ్-3 లో భర్తీ చేసే పోస్టులు

గ్రూప్-2 (673 పోస్టులు): డిప్యూటీ తహశీల్దార్ (200), డిప్యూటీ ఎంపీడీఓ (176), సీనియర్ ఆడిటర్/అకౌంటెంట్ (90), ఏఎస్‌ఓ (59), జీఎస్‌టీ ఆఫీసర్ (40), ఎక్సైజ్ ఎస్‌ఐ (25), సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-2 (7) ఖాళీలు భర్తీ కానున్నాయి.

ఎక్సైజ్ కానిస్టేబుళ్లు (400)తో పాటు నీటిపారుదల, రోడ్లు-భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులు ఉన్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ సంస్థల్లో విద్యుత్ ఇంజినీరింగ్ పోస్టులను నింపుతారు.

ఫేజ్-4 ఉపాధ్యాయ నియామకాలు

ఈ విడత కింద విద్యాశాఖలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఇతర ఇన్స్ట్రక్టర్ పోస్టులతో కూడిన 2,991 టీచర్ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నియామకాలన్నీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025, రోస్టర్ నిబంధనలు, రిజర్వేషన్ పాలసీకి అనుగుణంగానే పారదర్శకంగా జరుగుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రభుత్వం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థులు తమ పోటీ పరీక్షల సన్నాహాలను ముమ్మరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి, ఆయా శాఖల వారీగా నిర్దేశించిన సిలబస్ ప్రకారం సిద్ధం కావడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe