రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ సవరించిన నూతన షెడ్యూల్‌ను గురువారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది.

తాజా షెడ్యూల్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 87 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు)/నగర పంచాయతీలకు నవంబరు 1వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబరు 2న రీపోలింగ్ పూర్తి చేసి, నవంబరు 3వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదుర్కొని నామినేషన్ పత్రాలు చించివేత వంటి అక్రమాల వల్ల కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని ఎస్‌ఈసీ గుర్తించింది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి ఒక్కరికీ పోటీ చేసే అవకాశం కల్పించేందుకు గాను మొత్తం 72 వార్డులు/డివిజన్లకు కొత్తగా నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది.
గతంలో వాయిదా పడిన మైదుకూరు మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకూ నామినేషన్ల గడువు పొడిగించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంతో రాజంపేట మున్సిపాలిటీ 11 వార్డులకు తిరిగి నామినేషన్ల అవకాశం కల్పించారు. కడప కార్పొరేషన్‌లో 11 డివిజన్లలో నూతనంగా నామినేషన్లు స్వీకరిస్తారు. తిరుపతి కార్పొరేషన్ 18 డివిజన్లలో అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు.
అభ్యర్థుల సౌకర్యార్థం, భద్రత దృష్ట్యా ఈ స్థానాలకు గతంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలతో పాటు, అదనంగా సంబంధిత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిగిలిన స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ క్రింది విధంగా సాగనుంది:
నామినేషన్ల స్వీకరణ: అక్టోబరు 23, 24 తేదీలలో
{{/usCountry}}నామినేషన్ల స్వీకరణ: అక్టోబరు 23, 24 తేదీలలో
{{/usCountry}}నామినేషన్ల పరిశీలన: అక్టోబరు 25 ఉదయం
అక్టోబరు 25 నామినేషన్ల ఉపసంహరణకు గడువు, అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
పోలింగ్ తేదీ: నవంబరు 1
రీపోలింగ్ (అవసరమైతే): నవంబరు 2
ఓట్ల లెక్కింపు (కౌంటింగ్): నవంబరు 3
తొలివిడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్టోబరు 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించి, 21న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అయితే తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబరు 25 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. బాధితులు సమర్పించిన వినతులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యల వల్ల పోటీకి దూరమైన వారికి కనీసం 48 గంటల సమయం ఇచ్చి నామినేషన్ల స్వీకరణకు పునరుద్ధరించాలని సూచించడంతో ఈ సవరించిన షెడ్యూల్ వెలువడింది.
కోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకున్న ఎన్నికల కమిషన్, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.