...
...
Next Story

AP Rajya Sabha Elections 2026 :లెక్క కుదిరింది... టీడీపీకి 3, జనసేనకు ఒక రాజ్యసభ సీటు..! NDA కూటమి నిర్ణయం

AP Rajya Sabha Elections 2026 : అమరావతిలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానాన్ని కేటాయించేందుకు అవగాహన కుదిరింది.

Published on: Jun 4, 2026, 21:02:21 IST
Advertisement

AP Rajya Sabha Elections 2026 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతిలో జరిగిన ఎన్డీయే (NDA) కూటమి భాగస్వామ్య పక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన కూటమి నేతలు…. తెలుగుదేశం పార్టీ కి మూడు రాజ్యసభ స్థానాలను, అలాగే జనసేన పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తూ పంపకాలను పూర్తి చేశారు.

రాజ్యసభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈ సమావేశం సాగింది. సభలో ఉన్న బలాబలాలు, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ సీట్ల సర్దుబాటును అత్యంత సున్నితంగా పూర్తి చేశారు. ఈ నాలుగు స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఎన్డీయే కూటమి ప్రతినిధులు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పే సమర్థులైన నాయకులను ఈ స్థానాలకు ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభం కాగా…. ఒకట్రెండు రోజుల్లోనే పేర్లను ఖరారు చేయనున్నారు.

రేసులో ఎవరున్నారు..?

రాజ్యసభ సీట్ల రేసులో అందరికంటే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు చింతకాయల విజయ్. ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగాన్ని, సోషల్ మీడియా వ్యూహాలను విజయ్ వెనుకుండి నడిపించారు. గత కొన్ని ఎన్నికల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లభించకపోయినప్పటికీ…. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సంస్థాగత సేవల దృష్ట్యా ఈసారి పెద్దల సభకు పంపే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్, పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు మరో విడత అవకాశం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శాసనసభలో తిరుగులేని బలం ఉండటంతో వీరి ఖాతాల్లోకే ఈ స్థానాలు వెళ్తాయి. కానీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, కూటమి ధర్మం, పార్టీ పట్ల విధేయత వంటి అంశాలను సమతుల్యం చేయడంపైనే చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe